అంతా గప్ చుప్….ముసుగుతన్నేసినట్లుందే?

ఒక వైపు కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. జనాలు దాని ధాటికి ఒక్క లెక్కన భీతిల్లిపోతున్నారు. ఇక కరోనా వైద్య సదుపాయాలు, సమాచారం నుంచి వ్యాక్సినేషన్ [more]

Update: 2021-05-17 03:30 GMT

ఒక వైపు కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. జనాలు దాని ధాటికి ఒక్క లెక్కన భీతిల్లిపోతున్నారు. ఇక కరోనా వైద్య సదుపాయాలు, సమాచారం నుంచి వ్యాక్సినేషన్ వరకూ ప్రతీ దాని మీద ప్రజలకు అయోమయమే. జనాలకు ఏమీ తెలియని పరిస్థితి. అర్ధం కాని స్థితి. మరి ఈ సమయాన అధికారులతో పాటు అండగా ఉండి జనాలకు ధైర్యం చెప్పాల్సిన వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు అంటే సమాధానం లేదు. ఇది తమ పని కాదు అన్నట్లుగా ఏ నాయకుడూ బయటకు రాకుండా డెన్ లోకి వెళ్ళినట్లుగా ఉందని విపక్షాలు అంటున్నారంటే అర్ధముందిగా.

ఎంత తేడా …?

ఏవి తల్లి నిరుడు కురిసిన కరుణా కటాక్షాలు అంటూ జనాలు అధికార పార్టీ వైసీపీ నేతల వైఖరి మీద సెటైర్లు వేస్తున్నారు. గత ఏడాది కరోనా ముందు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అవి కరోనా తోనే సడెన్ గా వాయిదా పడ్డాయి. దాంతో ఏ క్షణమైనా ఎన్నికలు జరుగుతాయి అన్న ఆతృత రాజకీయ ఆరాటం నేతలను జనం వెంట పరుగులు తీయించింది. నాడు వద్దనా కూడా ప్రతీ ఇంటికీ నేతలు వెళ్ళి యోగ క్షేమాలు తెలుసుకునేవారు. వారికి అన్ని రకాలుగా సాయం చేసేవారు. ఈ విషయంలో పోటీ పడి మరీ జనాలను సేవ చేసేవారు. మొత్తానికి ఆ కధే వేరు అన్నట్లుగా అంతా సాగింది.

బోడి మల్లయ్యలేనా ?

ఇక ఇపుడు చూస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఈ మధ్యనే ముగిసాయి. దగ్గరలో మరే ఎన్నిక కూడా లేదు. మూడేళ్ళ వరకూ జనం ముఖం చూడాల్సిన అవసరం రాదు, అందుకే అధికార వైసీపీ నాయకులు ఏకంగా ముసుగు తన్నేశారని కామెంట్స్ పడుతున్నాయి. కరోనా రెండవ దశ ఏప్రిల్ లో విజృంభించింది. దాంతోనే నాయకులు కూడా కనిపించడం మానేశారు అని విమర్శల జడివాన కురుస్తోంది. ప్రభుత్వం తమది, తమ నాయకుడు పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు జనాలకు చేరువ అవుతున్నాయా లేదా అన్న సోయి కూడా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల నేతలలో లేకుండా పోయింది అంటున్నారు. ఓటేసిన తరువాత జనాలు బోడి మల్లయ్యలే అయ్యారని కూడా హాట్ కామెంట్స్ వస్తున్నాయి.

డోర్స్ క్లోజ్ ….

చాలా మంది వైసీపీ నాయకులు కరోనాకు భయపడి తమ ఇంటి తలుపులే కాదు, తాము నిర్వహిస్తున్న పార్టీ ఆఫీస్ తలుపులూ వేసేశారు. తమ వద్దకు రావద్దు అని కార్యకర్తలకు కూడా సుతి మెత్తగా చెప్పేశారు. ఏమైనా అంటే కరోనా ముందు జాగ్రత్త సుమా అంటూ తిరిగి వారికే సుద్దులు చెబుతున్నారు. ఫోన్లో అందుబాటులో ఉంటామని కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు కానీ ఆ ఫోన్లు మాత్రం అవుటాఫ్ కవరేజ్ ఏరియా అంటున్నాయి. మొత్తానికి విపక్షం సంగతి పక్కన పెడితే అధికార పార్టీకి గురుతర బాధ్యత ఉంటుంది. అధికారులు ఉన్నారు కానీ జనాలకు జవాబుదారీగా తాముండాలని, తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్న తపన తాపత్రయం అయితే చాలా మంది వైసీపీ నేతలకు లేకుండా పోయింది అంటున్నారు. గత సారి కంటే ఈసారి కరోనా ధాటి అధికంగా ఉంది. అందువల్ల జనాలకు ఇపుడే నాయకుల అవసరం ఉంది. ఈ సమయంలో నేతలు గాయబ్ అయితే చెడ్డ పేరు సర్కార్ కే వస్తుంది. కానీ అన్నీ తెలిసిన ఫ్యాన్ పార్టీ నేతలు సరైన టైమ్ చూసి మరీ ఫ్యాన్ చక్రాలను ఆపేశారు జనాలకు ఉక్కబోత మిగిల్చారు.

Tags:    

Similar News