ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు…..ఖ‌ర్చు పెట్టండి బాస్‌..!

ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా కోర‌లు చాస్తోంది! కేవ‌లం ప‌ది పాజిటివ్ కేసులు మాత్రమే న‌మోదు కావ‌డం నాకెంతో సంతోషంగా ఉంది-అంటూ.. సీఎం జ‌గ‌న్ ప్రక‌టించిన నాటి నుంచి [more]

Update: 2020-04-09 08:00 GMT

ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా కోర‌లు చాస్తోంది! కేవ‌లం ప‌ది పాజిటివ్ కేసులు మాత్రమే న‌మోదు కావ‌డం నాకెంతో సంతోషంగా ఉంది-అంటూ.. సీఎం జ‌గ‌న్ ప్రక‌టించిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు గడిచిన రోజులు ఐదే అయినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ప‌ది రెట్లు మించిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వంద‌ల పైమాటే. ఇది ఇప్పటితో ఆగేలా కూడా లేదు. ఇక‌, కీల‌క‌మైన విజ‌య‌వాడ పరిధిలోకి వ‌చ్చే స‌రికి కూడా ఈ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. విజ‌య‌వాడ అత్యధిక కేసుల‌తో ఏపీలోనే ఎక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లాతో పోటీ ప‌డుతోంది.

విజయవాడలో మాత్రం…..

రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితి ఉన్న జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు స్పందిస్తున్నారు. త‌మ చేతిలో ఉన్న సొమ్ముతో మాస్కులు కొని పంచుతున్నారు. కొంద‌రు ప్రజ‌ల్లో అవేర్‌నెస్ క‌ల్పించేందుకు క‌రప‌త్రాలు ముద్రించి పంచుతున్నారు. ఇంకొంద‌రు జాగ్రత్త లు చెబుతున్నారు. మ‌రికొంద‌రు శానిటైజ‌ర్ బాటిళ్లను పంచుతున్నారు. ఇక‌, పేద‌ల‌కు ప్రభుత్వం ఇస్తున్న నిత్యావ‌స‌రాల‌ను కాకుండా వైసీపీ నాయ‌కులు మ‌రిన్ని కొని పంచుతున్నారు. ఇలా ఏదో ఒక రూపంలో పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే విజ‌య‌వాడ వంటి కీల‌క న‌గ‌రంలో ఒక మంత్రి, మ‌రో ఎమ్మెల్యే ఉండి కూడా ఇక్కడ వైసీపీ త‌ర‌ఫున ప్రజ‌ల‌కు ఏమీ మేలు జ‌ర‌గ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇద్దరూ వ్యాపారులే…..

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లోని మూడు స్థానాల్లో రెండు స్థానాల‌ను వైసీపీ త‌న కైవ‌సం చేసుకుంది. ఈ క్రమంలోనే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. ఇక‌, సెంట్రల్ నుంచి విజ‌యం సాధించిన మ‌ల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప‌ద‌విని ఇచ్చారు అయితే, వీరిద్దరూ మాత్రం ఇప్పుడు క‌ష్ట కాలంలో ప్రజ‌ల‌కు అందుబాటులో లేకుండా కేవ‌లం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అంతేకాదు, ఇద్దరూ కూడా వ్యాపార దిగ్గజాలే అయినా ఒక్క రూపాయి కూడా బ‌య‌ట‌కు తీయ‌డం లేద‌న్న విమ‌ర్శలే ఎక్కువుగా ఉన్నాయి. ఇక ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ప్రజ‌ల‌కు క‌నీస అవ‌స‌ర‌మైన మాస్కులు, శానిటైజ‌ర్లను త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా పంచేందుకు చొర‌వ చూప‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అయినా.. వీరు మాత్రం తాము ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా ప్రజ‌లు ఈ స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లే ఉన్నాయి.

Tags:    

Similar News