బెజ‌వాడ అధికార పార్టీలో ఆగ‌ని కీచులాట‌లు

రాజ‌కీయ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య కీచులాట కొన‌సాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే పంచాయి‌తీ కూడా జ‌రిగినా.. ఇద్దరి నేతల్లోనూ మార్పు రాలేద‌ని అంటున్నారు [more]

Update: 2020-08-22 02:00 GMT

రాజ‌కీయ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య కీచులాట కొన‌సాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే పంచాయి‌తీ కూడా జ‌రిగినా.. ఇద్దరి నేతల్లోనూ మార్పు రాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వారే మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌, సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ మ‌ల్లాది విష్ణు. న‌గ‌రంలో మంత్రిగా త‌న హ‌వా ఉండాల‌ని వెలంప‌ల్లి కోరుకుంటే.. తాను సీనియ‌ర్‌ను కాబ‌ట్టి త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విష్ణు ప‌ట్టుబ‌డుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ, ప్రభుత్వ వ్యవ‌హారాల్లో వీరిద్దరు ఆధిప‌త్యం కోసం ఫైటింగ్‌కు దిగుతున్నారు. కొద్ది రోజుల క్రింద‌ట విజ‌య‌వాడలో సీఎం జ‌గ‌న్ 104, 108 వాహ‌నాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఇద్దరు నేత‌ల‌కు ఆహ్వానం అందింది.

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే……

ఈ కార్యక్రమంలో ముందుగా మ‌ల్లాది విష్ణు స్టేజ్‌పైకి ఎక్కితే.. ఏకంగా మంత్రి వెల్లంప‌ల్లి కిందే ఉండిపోయారు. త‌ర్వాత సీఎం జ‌గ‌న్ పిలిచి ఆయ‌న‌ను స్టేజీ ఎక్కించాల్సి వ‌చ్చింది. ఇది వ్యతిరేక మీడియాలో ప్రచారం కూడా జ‌రిగింది. ఇక‌, దీనికి ముందు కూడా ఎమ్మెల్యే మ‌ల్లాది చేసిన సిఫార‌సుల‌ను బుట్టదాఖ‌లు చేశారు మంత్రి. దీంతో వివాదం తారా‌స్థాయికి చేరింది. వాస్తవ అవాస్తవాలెలా ఉన్నా అక్కడ వైసీపీ వ‌ర్గాల టాక్ ప్రకారం మ‌ల్లాది లేదా ఆయ‌న వ‌ర్గం నుంచి సిఫార్సులు, బ‌దిలీల లెట‌ర్లు వ‌స్తే ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి ఆఫీస్‌లో నేత‌ల‌కు ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌.

చందాల దందా చేస్తున్నారంటూ…….

అయితే, ఇలాంటి వ్యవ‌హారాలు పార్టీని డైల్యూట్ చేస్తాయ‌నే ప్రచారం జ‌రుగుతున్నా.. ముఖ్యంగా టీడీపీకి బ‌ల‌మైన న‌గ‌రంగా ఉన్న విజ‌య‌వాడ‌లో ఇలాంటి చ‌ర్యలు మంచివి కావ‌ని అధిష్టానం సూచ‌నలు చేస్తున్నా వీరు మారకుండా పంతాలు, ప‌ట్టింపుల‌కు పోతున్నార‌ట‌. ఇప్పుడు ఈ వివాదం మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మీడియాలో మంత్రి వెలంప‌ల్లికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు వ‌చ్చాయి. ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్కరించుకుని వ్యాపార వ‌ర్గాల నుంచి చందాలు వ‌సూలు చేశార‌ని క‌థ‌నం సారాంశం. మంత్రి అసలు పుట్టిన రోజు నిర్వహించుకునేందుకు ఆస‌క్తి చూప‌లేద‌ని.. అప్పుడు వ‌సూళ్లకు ఛాన్స్ ఎక్కడుంద‌నేది మంత్రి అనుచ‌రుల ప్రశ్న.

సొంత పార్టీ నేతలే…?

అయితే, దీనిని రాజ‌కీయంగా వాడుకుని విమ‌ర్శలు చేయాల్సి టీడీపీ నేత‌లు సైలెంట్ అయిపోతే.. సొంత పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్యే మ‌ల్లాది చేసిన వ్యాఖ్యలు మంత్రిని ప‌రోక్షంగా ఉద్దేశించి ప్రతి విమ‌ర్శలు చేసిన‌ట్టుగా ఉన్నాయ‌న్న చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి. 'మీడియాను త‌ప్పు ప‌ట్టలేం. నిప్పులేందే పొగ వ‌స్తుందా!' అని మ‌ల్లాది న‌ర్మగ‌ర్భంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో వెలంప‌ల్లిని ఎమ్మెల్యే టార్గెట్ చేశార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఈ కీల‌క నేతల మ‌ధ్య స‌ఖ్యత ఎప్పుడు.. పార్టీ బ‌ల‌ప‌డేది ఎప్పుడు ? అని న‌గ‌ర వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే పార్టీ ఓడిపోయిన తూర్పులోనే ఇప్పుడు పార్టీలో గ్రూపుల గోల స‌మ‌సిపోయి ప్రశాంతంగా ఉంద‌ని చెవులు కొరుక్కుంటున్నారు.

Tags:    

Similar News