వైసీపీలో కొత్త ఎమ్మెల్యేలతో త‌ల‌నొప్పులు.. ఏం చేస్తున్నారంటే..?

చెబితే విన‌రు.. చ‌ర్యలు తీసుకుంటే హ‌ర్ట్ అవుతారు! అన్నట్టుగా ఉంది వైసీపీలోని కొత్త ఎమ్మెల్యేల ప‌రిస్థితి. అంద‌రూ కాదుకానీ, కొందరు మాత్రం ఓవ‌ర్ యాక్షన్ చేస్తున్నార‌ని అంటున్నారు. [more]

Update: 2020-04-23 02:00 GMT

చెబితే విన‌రు.. చ‌ర్యలు తీసుకుంటే హ‌ర్ట్ అవుతారు! అన్నట్టుగా ఉంది వైసీపీలోని కొత్త ఎమ్మెల్యేల ప‌రిస్థితి. అంద‌రూ కాదుకానీ, కొందరు మాత్రం ఓవ‌ర్ యాక్షన్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఎమ్మెల్యేగా త‌మ ప‌రిధిలో తాము ఉంటే బాగానే ఉంటుంది. కానీ, దీనిని మించి వారు చేస్తున్న అతి .. వారిని, పార్టీని, పార్టీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శల పాలు చేస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలు.. ఇటీవ‌ల కాలంలో అతి చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం పార్టీ వ‌ర్గాల్లో సైతం చ‌ర్చనీయాంశంగా మారింది.

హడావిడి ఎక్కువ కావడంతో…..

ర‌జ‌నీ విష‌యాన్ని చూస్తే.. ఆమె ఏకంగా ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లి మ‌రి అధికారుల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం, వారిని హెచ్చరించ‌డంపై విమ‌ర్శలు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ అధికారుల‌ను వెంట బెట్టుకుని హ‌ల్‌చల్ చేస్తున్న తీరు కూడా విమ‌ర్శల‌కు తావిచ్చింది. కొద్ది నెల‌ల క్రిత‌మే ఓ పోలీస్ అధికారి ఆమె తీరుకు మ‌న‌స్థాపానికి గురై నియోజ‌క‌వ‌ర్గం నుంచి వెళ్లిపోయారు. ఇక మున్సిప‌ల్ ఆఫీసుతో పాటు ఎక్సైజ్ కార్యాల‌యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నానా హ‌డావిడి చేస్తున్నార‌న్న చ‌ర్చలే న‌డుస్తున్నాయి. కొన్ని విష‌యాల్లో అధికారుల్లో ఆమె చ‌ల‌నం తేవాల‌న్న ఆతృత ఉన్నా హ‌డావిడే ఎక్కువుగా ఉంటోందంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఈ యేడాది కాలంలో జ‌రిగిన ప‌నుల క‌న్నా ఆమె హ‌డావిడే ఎక్కువ ఉంద‌న్న చ‌ర్చలు పేట నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ….

నిజానికి సేవ చేయాల‌ని ఉన్నప్పటికీ ఆమె ప‌రిణితి చెందిన రాజ‌కీయ నాయ‌కురాలిగా వ్యవ‌హ‌రించాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. ఇక‌, తాడికొండ ఎమ్మెల్యేదీ ఇదే తీరుగా ఉంది. కేవలం త‌న అనుకున్న వారికి మాత్రమే ఆమె ద‌ర్శనం ఇస్తున్నారు. మిగిలిన స‌మ‌స్యల‌ను కానీ, మిగిలిన వారిని కానీ, ఆమె ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు కొంద‌రు కీల‌క నేత‌ల‌తోనూ ఆమె స‌ఖ్యత‌గా ఉండ‌డం లేద‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నుంచి తొలిసారి ఎన్నికైన వెంక‌టే గౌడ కూడా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ అమ‌ల‌వు తుంటే. ఆయ‌న మాత్రం క‌ల్వర్టుల‌కు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

పార్టీ పరువును…..

ఇది స‌రికాద‌నే విమ‌ర్శలు వ‌స్తే.. ఏకంగా మీడియాపైనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌పైనా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. లాక్‌డౌన్ నియ‌మాలు ఉల్లంఘించి సొంత ప‌నుల కోసం బెంగ‌ళూరుకు వెళ్లిరావ‌డం.. ఆంధ్రా – క‌ర్నాట‌క బోర్డర్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఏదైనా చేయాల్సి ఉంటే , నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల‌కు మంచి చేస్తే.. వేరే సంగ‌తి..అలా కాకుండా ఇలా చేయ‌డం వ‌ల్ల పార్టీ ప‌రువు స‌హా నాయ‌కులుగా వారు కూడా ప‌రువు పోగొట్టుకుంటున్నారు. మొత్తానికి వీరికి ముకుతాడు వేయాల్సి ఉంద‌నే చ‌ర్చమాత్రం జోరుగా సోగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News