ఆ అదృష్టం అందలం ఎక్కిస్తుందా? అంత ఈజీ కాదా?

ఎట్టి ప‌రిస్థితిలోనూ స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మేయ‌ర్ స్థానాల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఈ క్రమంలోనే నాయ‌కులు కూడా [more]

Update: 2020-03-14 15:30 GMT

ఎట్టి ప‌రిస్థితిలోనూ స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మేయ‌ర్ స్థానాల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఈ క్రమంలోనే నాయ‌కులు కూడా ఇప్పటికే అలెర్ట్ అయ్యారు. అయితే, కొన్ని స్థానాల్లో సొంత నేత‌ల నుంచే మేయ‌ర్ పీఠాల‌కు పోటీ ఏర్పడుతుండ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఎవ‌రికివారు కీల‌క నాయ‌కులు త‌మ స‌త్తా చాటుకుని, త‌మకు అనుకూలంగా ఉండే వ్యక్తుల‌కే మేయ‌ర్ పీఠాల‌ను అప్పగించాల‌ని చూస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు మేయ‌ర్ స్థానాలకు వైసీపీలో హోరా హోరీ పోరు సాగుతోంది. విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. మొత్తం న‌లుగురు నాయ‌కులు మాకంటే మాకేన‌ని మేయ‌ర్ సీటు కోసం పోటీ ప‌డుతున్నారు.

తమ వారికి కేటాయించుకోవాలని….

సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు బెజ‌వాడ మేయ‌ర్ సీటును త‌న వ‌ర్గానికి చెందిన వారికే కేటాయించుకోవాలని చూస్తున్నారు. జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించ‌డంతో త‌న సోద‌రుడి స‌తీమ‌ణిని రంగంలోకి దింపేందుకు ఆయ‌న ప్రయ‌త్నిస్తున్నారు. ఇక‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన బొప్పన భ‌వ కుమార్ త‌న స‌తీమ‌ణి అయితే, క‌రెక్ట్‌.. ఎలాగూ నేను ఓడిపోయాను కాబ‌ట్టి.. ఈ సీటు మాకే కేటాయిస్తారు.. అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయ‌న న‌గ‌ర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దేవినేని అవినాష్ కోసం ఇన్‌చార్జ్ ప‌ద‌వి త్యాగం చేశారు. దీంతో భ‌వ‌కుమార్ త‌న భార్యకే మేయ‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

మంత్రి గారి ఇలాకా….

ఇలా ఈ ఇద్దరు నాయ‌కులు కూడా ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. ఇదిలావుంటే, సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. వెస్ట్ నుంచి ఏకంగా మంత్రి ఉన్నారు కాబ‌ట్టి తూర్పులో వైసీపీకి ఎలాంటి ప‌ద‌వులు లేవ‌ని చెబుతున్న యువ నాయ‌కుడు, ఇటీవ‌లే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి దేవినేని అవినాష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న మేయ‌ర్ పీఠాన్ని త‌న‌కు అనుకూలంగా ఉండే వ్యక్తికి కేటాయించాలంటూ.. అధిష్టానానికి చెబుతున్నారు. స‌రే! ఈ ముగ్గురి మ‌ధ్య పోరు ఇలా ఉంటే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి, వెలంప‌ల్లి శ్రీనివాస్ కూడా త‌న స‌త్తా చాటు కునేం దుకు, త‌న ఆధిప‌త్యాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

అంత సులువు కాదు…

దీనిలో భాగంగానే ఆయ‌న త‌న‌కు అనుకూలంగా ఉండే మ‌హిళ‌ను ఇక్కడ నుంచి మేయ‌ర్ పీఠంపై నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ కోసం ఆయ‌న వెతుకులాట ప్రారంభించార‌ట‌. మొత్తంగా చూస్తే.. విజ‌య‌వాడ‌లో మేయ‌ర్‌పీఠం కోసం అధికార పార్టీలో అంత‌ర్గత కుమ్మలాట‌లు జోరుగా సాగుతున్నాయ‌న్నమాట‌. ఇక నియోజ‌క‌వర్గాల వారీగా చూస్తే న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి కాస్త బ‌లం ఉంది. సెంట్రల్‌, ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ఢీకొట్టి ఎక్కువ కార్పొరేట‌ర్ సీట్లు గెల‌చుకోవ‌డం అంత సులువు కాదు.

Tags:    

Similar News