అసలు ప్రయోజనం అదే.. దెబ్బ తీయడం అంటే ఇదే..?
వైసీపీ సర్కార్ తన టార్గెట్ ను నేరుగా ఫిక్స్ చేసుకుంది. ఏడాది కాలంగా రాజ్యాంగ వ్యవస్థలు సహా ప్రతిపక్షాలన్నిటితోనూ సాగిస్తున్న పోరాటాన్ని కొత్త మలుపు తిప్పింది. అప్రతిహతమైన [more]
వైసీపీ సర్కార్ తన టార్గెట్ ను నేరుగా ఫిక్స్ చేసుకుంది. ఏడాది కాలంగా రాజ్యాంగ వ్యవస్థలు సహా ప్రతిపక్షాలన్నిటితోనూ సాగిస్తున్న పోరాటాన్ని కొత్త మలుపు తిప్పింది. అప్రతిహతమైన [more]
వైసీపీ సర్కార్ తన టార్గెట్ ను నేరుగా ఫిక్స్ చేసుకుంది. ఏడాది కాలంగా రాజ్యాంగ వ్యవస్థలు సహా ప్రతిపక్షాలన్నిటితోనూ సాగిస్తున్న పోరాటాన్ని కొత్త మలుపు తిప్పింది. అప్రతిహతమైన మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. రాజ్యాంగ వ్యవస్థలతో పోరాటం సమయాన్ని వృథా చేసింది. ప్రధాన ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకుంటూ దాడి చేయడంలో వ్యూహాత్మక వైఫల్యం విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చింది. ఆ పొరపాట్ల నుంచి క్రమేపీ పాఠాలు నేర్చుకుంటూ ప్రస్తుతం నేరుగా ప్రధాన ప్రతిపక్షంపై గురి పెట్టింది. అందులోనూ మిగిలిన రాజకీయ పక్షాలను , తెలుగుదేశాన్నివేరు చేస్తూ పకడ్బందీగా దాడులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకూ ప్రజాసమస్యలపై ఆందోళనల పేరిట తెలుగుదేశం వైఖరిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇతర పార్టీలన్నీ సమర్థిస్తూ వచ్చాయి. తాజాగా ఆ పరిస్థితికి తావివ్వకుండా తెలుగుదేశం పై అవినీతి అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
‘సీ’ రియల్ దాడులు…
నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం సవాళ్లు విసురుతూనే ఉంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి తమపై విచారణలు జరిపి అవినీతిని బయటపెట్టుకోవచ్చుననేది టీడీపీ సవాళ్ల సారాంశం. తొలి దశలో దీనిపై పెద్దగా దృష్టి పెట్టని వైసీపీ ఇతర అంశాలపై శ్రమ పడింది. పోలవరం, రాజధాని, ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో వివాదం, పార్టీ రంగులపై న్యాయపోరాటం వంటి అంశాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చించింది. ఇవన్నీ దాదాపు ప్రభుత్వానికి ప్రతికూలంగానే పరిణమించాయి. పైపెచ్చు ప్రతిపక్షాలు ఆధిక్యం సాధించడానికి, ఏకతాటిపైకి రావడానికి దోహదం చేశాయి. న్యాయ, రాజ్యాంగ అంశాల్లో ప్రభుత్వానికి పరిధులు, పరిమితులు ఉంటాయి. ఆ అంశాన్ని విస్మరించి దూసుకుపోవాలని ప్రయత్నించడమూ చేదు ఫలితాలనిచ్చింది. దీంతో ముందుగా తాను ప్రధాన ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయాలనే విషయంలో వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఫలితంగానే తాజాగా టీడీపీ నేతలపై వరస దాడులు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల పనులు, కార్యకలాపాలు సాగాయి. అనేక పథకాలలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలున్నాయి. వాటిపై వైసీపీ దృష్టి పెట్టింది. టీడీపీ అధినేతకు అండగా ఉండేవారిపై పెడుతున్న కేసులు ఆ పార్టీ శ్రేణులను బెంబేలెత్తిస్తున్నాయి.
ఎక్కుపెట్టిన ఏసీబీ…
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది అవినీతి నిరోధక శాఖ. చంద్రబాబు తన పదవీకాలం చివరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ రాష్ట్రంలో కేసుల దర్యాప్తు జరపకుండా నిషేధం విధించారు. ఇందుకు రాజకీయ కారణాలు, అవసరాలు తోడ్పడ్డాయి. అదే సందర్భంలో కేసుల దర్యాప్తునకు సంబంధించి కొన్ని ప్రత్యేక అధికారాలను ఏసీబీకి కట్టబెట్టారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. కొంతమేరకు ఆధారాలు ఉండి పట్టుబిగించే అవకాశం ఉన్నచోట్ల ఏసీబీని ప్రయోగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొమ్మిదివందల కోట్ల రూపాయల మేరకు సాగిన మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లు, టెలి వైద్య సేవల స్కాంలో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగలిగింది. ఈఎస్ఐ కు సంబంధించిన ఈ స్కాంలో నిజానికి కేంద్రనిధులే అధికం. అయినప్పటికీ సీబీఐకు కేసును అప్పగించకుండా రాష్ట్రప్రభుత్వమే ఏసీబీ ద్వారా విచారణ జరపాలనుకోవడంలోనే రాజకీయం దాగి ఉంది. కేసును వేగవంతం చేయడం, అవసరాలకు అనుగుణంగా అవినీతి నిరోధక సెక్షన్లను వినియోగించే వెసులుబాటును వినియోగించుకోవడమే ఉద్దేశం. అదే సీబీఐ అయితే ఏళ్లుపూళ్లు పట్టే అవకాశం ఉంది.
ఎదురుచూపుల్లో సీబీ‘ఐ’…
వైసీపీ సర్కారుది ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు లోతైన అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. విచారణల్లో సీబీఐ తీరు వేరు. కోడిగుడ్డుపైన సైతం వెంట్రుకలు తీయగల సామర్థ్యం దాని స్పెషాలిటీ. అందుకే క్లిష్టంగా ఉంటుందనిపించే అంశాల్లోనూ, రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగే విషయాల్లోనూ సీబీఐ దర్యాప్తును కోరాలని భావిస్తోంది. చంద్రన్న కానుకలు, హెరిటేజ్ కొనుగోళ్లపై దర్యాప్తునకు సీబీఐ ను ఆశ్రయించాలని మంత్రిమండలి తీర్మానించడంలోని ఉద్దేశమిదే. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి కుటుంబ వ్యాపార మూలాలపైన కూడా వైసీపీ సర్కార్ నజర్ పెట్టిందనేందుకు ఇదొక ద్రుష్టాంతం. అయితే వైసీపీ అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల రూపాయల అవినీతి పేరిట ఆరోపణలు చేసిన రాజధాని, పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల వంటి వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే ఈ ప్రభుత్వంలోనూ ప్రాజెక్టులను దక్కించుకోవడం విశేషం.
చక్రవ్యూహంలో చంద్రబాబు….
పక్కాగా పొలిటికల్ అజెండాతో వైసీపీ పావులు కదుపుతూ ఉండటంతో టీడీపీకి అండగా నిలిచేవారు కరవు అయిపోతున్నారు. ఈ ఎస్ ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడాన్ని విపక్షాలేవీ వ్యతిరేకించలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఉపయోగించిన బీసీ కార్డును తీవ్రంగా ఆక్షేపించాయి. టీడీపీ నుంచి తమను తాము దూరం చేసుకునే ఒక అవకాశంగా దీనిని విపక్షాలు భావించాయి. ఈమేరకు వైసీపీ సర్కార్ విజయం సాధించనట్లే చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ , జనసేన, వామపక్షాలు గత ప్రభుత్వంలో అవినీతి పరులను శిక్షించాలనే నినాదాన్ని ఎత్తుకున్నాయి. దీంతో అంతా తనతో కలిసి రావాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపులు వృథా ప్రయాసగా మిగిలిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోని లోపాలు, అవినీతిపై బలమైన ఆధారాలు చూపించగలిగితే భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ తెలుగుదేశంతో కలిసి నడవకపోవచ్చు. ఇది కచ్చితంగా సర్కారుకు లాభించే పరిణామమే.
-ఎడిటోరియల్ డెస్క్