బాబుకు ఊపిరి పోస్తుంది జగనే…?

బాగా నష్టపోయిన తెలుగుదేశం పార్టీకి ఊతమిస్తుంది వైసీపీయేనా? ఏపీ ఇంటలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందా? ఎప్పుడో మూడేళ్ల తర్వాత చంద్రబాబుకు రావాల్సిన సానుభూతి ఇప్పుడే వస్తుందా? వ్యూహరచనలో [more]

Update: 2020-03-02 14:30 GMT

బాగా నష్టపోయిన తెలుగుదేశం పార్టీకి ఊతమిస్తుంది వైసీపీయేనా? ఏపీ ఇంటలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందా? ఎప్పుడో మూడేళ్ల తర్వాత చంద్రబాబుకు రావాల్సిన సానుభూతి ఇప్పుడే వస్తుందా? వ్యూహరచనలో వైసీపీ అనుభవలేమి తెలిసిపోతుందా? వరస సంఘటనలు టీడపీీకి లాభం తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఎన్నికలకు ముందు పుంజుకోవాల్సిన టీడీపీని వైసీపీ ప్రభుత్వం తన చర్యల ద్వారా ఇప్పటి నుంచే బలోపేతం చేస్తుందన్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది వాస్తవం. జగన్ కు ఇంటలిజెన్స్ నివేదికలు సక్రమంగా అందడం లేదన్నది కూడా అర్థమవుతోంది.

సంక్షేమ పథకాల అమలుతో…..

నిజానికి మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించి తిరుగులేని స్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కోలుకోలేని స్థితికి వెళ్లింది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. నిధులు లేకున్నా కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుంది. చంద్రబాబు అమలు చేయలేని స్కీం లను కూడా జగన్ అమలు చేస్తున్నారన్న పేరు అనతి కాలంలోనే తెచ్చుకుంది. ఇక టీడీపీ కూడా ఇసుక కొరత తర్వాత ఏం చేయాలో తెలియక, పార్టీ క్యాడర్ లో జోష్ నింపలేక సతమతమవుతున్న దశలో మూడు రాజధానుల అంశం టీడీపీకి అంది వచ్చింది.

జాతీయ స్థాయిలోనూ….

మూడు రాజధానుల అంశం టీడీపీకి ఏ మేరకు కలసి వస్తుందన్నది పక్కన పెడితే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది చంద్రబాబుకు ఒకింత లాభమేనని చెప్పాలి. ఇక జేఏసీ బస్సు యాత్రను అడ్డుకోవడం ద్వారా టీడీపీకి వైసీపీ మరింత లాభం చేకూర్చింది. జాతీయ స్థాయిలో జగన్ వైఖరి చర్చనీయాంశమయింది. చలో ఆత్మకూరు సందర్భంగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయడం కూడా జాతీయ మీడియాలో హైలెట్ కావడంతో ఇక చంద్రబాబు ఆగలేదు.

అణిచివేత ధోరణిని….

ఎన్నికల ఫలితాలను చూసి మూడేళ్ల వరకూ కోలుకోలేదని భావించిన టీడీపీని వైసీపీయే కొత్త రక్తం ఎక్కించింది. వైసీపీ ప్రభుత్వం అణిచివేత ధోరణి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. పోలీసుల తీరు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. విశాఖ సంఘటనతో కూడా చంద్రబాబు ఒకింత సానుభూతిని తెచ్చుకోగలిగారు. ఆయన మీడియా సమావేశాలను కూడా తగ్గించారు. ప్రజలే డిసైడ్ చేస్తారని భావిస్తున్నారు. ఆందోళనలకు అనుమతులు ఇచ్చి ఉంటే ఇంత మైలేజీ టీడీపీకి దొరికేది కాదని వైసీపీ లోనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో ఏపీ ఇంటలిజెన్స్ విఫలమయిందనే చెప్పాలి. చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి వైసీపీయే పోసిందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News