ఇలా బాటలు వేసుకుంటున్నారన్న మాట

వైసీపీ అధినేత ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. తొలుత పార్టీ క్యాడర్ ను కరోనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక చోట్ల వైసీపీ నేతలు రోడ్ల [more]

Update: 2020-04-08 14:30 GMT

వైసీపీ అధినేత ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. తొలుత పార్టీ క్యాడర్ ను కరోనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక చోట్ల వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనేక చోట్ల నిత్యావసరావల వస్తువులను వైసీపీ నేతలు దగ్గరుండి పంపీణీ చేయిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా వైసీపీ క్యాడర్ తో నిఘా బృందాలు ఏర్పాటు చేసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఇక కరోనా శాంతించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రీషెడ్యూల్ చేస్తారా? లేదా? అలాగే నిర్వహిస్తారా? అన్న విషయాన్ని పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ప్రధానంగా పట్టణాల్లో మాత్రం పోటీ ఉంది. మున్సిపాలిటిలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైసీపీకి కొంత ఇబ్బంది ఎదురుకాక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో….

మూడు రాజధానుల ప్రతిపాదన, సంక్షేమ పథకాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయించడం వంటి వాటిపై పట్టణ ప్రజలు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రధానంగా పరిపాలన రాజధానిని తరలించాలనుకుంటున్న విశాఖలో కూడా ఈ వ్యతిరేకత కన్పిస్తుందంటు న్నారు. ఇవన్నీ వైసీపీకి కొంత ఇబ్బందికరంగానే మారాయి. అందుకే కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.

వైసీపీ నేతలే దగ్గరుండి….

అంతేకాదు వివిధ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను కూడా దగ్గరుండి చూసుకోవాలని కోరారు. దీంతో పింఛన్లు, రేషన్ వంటి కార్యక్రమాల్లో వైసీపీ నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాదు వెయ్యి రూపాయల నగదు పంపిణీని కూడా వాలంటీర్లు వైసీపీ నేతల చేతుల మీదుగానే అనేక చోట్ల చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఇది జరుగుతున్నట్లు విపక్షాలు సయితం ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద కరోనా విపత్తు సమయంలోనూ సాయం పేరిట వైసీపీ తన రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకుంటుందన్న ఆరోపణలు మాత్రం బలంగా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News