టీడీపీ కంచుకోట‌లో వైసీపీ పాగా వేస్తుందా..?

ఉత్తరాంధ్రలోని విశాఖ నగర ఓటర్ల తీర్పు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది? గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మీని ఎంపీగా ఓడించి [more]

Update: 2019-02-09 01:30 GMT

ఉత్తరాంధ్రలోని విశాఖ నగర ఓటర్ల తీర్పు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది? గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మీని ఎంపీగా ఓడించి అనూహ్యమైన తీర్పు ఇచ్చిన విశాఖ నగర ఓటరు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారు? ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో నగర అభివృద్ధి ఎలా ఉంది, నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు పని తీరు ఎలా ఉంది? అన్న దానిపై చర్చించుకుంటే నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ఉన్న మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధమైన చర్చ నడుస్తోంది. విశాఖ తూర్పు నుంచి గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే వెలగపూడి శ్రీరామకృష్ణబాబు వచ్చే ఎన్నికల్లో వరసగా మూడో సారి పోటీకి రెడీ అవుతున్నారు. 2009లో తూర్పు నుంచి తొలిసారి పోటీ చేసి ట్ర‌యాంగిల్‌ ఫైట్‌లో ప్రజారాజ్యం అభ్యర్థిని ఓడించిన వెలగపూడి గత ఎన్నికల్లో తనపై ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిన వంశీకృష్ణ శ్రీనివాస్‌పై ఏకంగా 48,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

మ‌ళ్లీ పాత ప్ర‌త్య‌ర్థులేనా..?

ఇక తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే పాత కాపులు బరిలోకి దిగే అవకాశం ఉన్నా ఎన్నికల చివరి క్షణంలో వైసీపీ అభ్యర్థి మారవచ్చన్న ప్రచారమూ ఉంది. మొత్తం 2,31,000 ఓట్లు ఉండగా వీరిలో పురుషులు 1,15,000, స్త్రీలు 1,16,000 ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన రామకృష్ణబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ వెలగపూడితో మూడోసారి పోటీ పడి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు ఓడిపోవడంతో పాటు ఆర్థిక కారణాల నేపథ్యంలో ఇంకా బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. తూర్పులో ఆంధ్రాలోని ఇతర జిల్లాల నుంచి వెళ్లి స్థిర నివాసం ఏర్పర్చుకున్న సెటిలర్స్‌ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. వీరే అభ్యర్థుల గెలుపు ఓటమిలను ప్రభావితం చెయ్యనున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఈ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే.

వైసీపీ అభ్య‌ర్థి ఆయ‌నేనా..?

ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి విషయానికి వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి హాజరు అవుతారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చెయ్యడం ఆయనకు కలిసి రానున్నాయి. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గాలి బలంగా వీచి విశాఖ నగరంతో పాటు చుట్టు పక్కల కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఈ రెండు పార్టీల హవాను తట్టుకుని తూర్పులో వెలగపూడి విజయాన్ని సాధించారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి, గత ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి దిగి రెండు సార్లు ఓడిపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ బాగానే కష్టపడుతున్నారు. మూడో సారి ఆయన వెలగపూడితో పోటీ పడి ఈసారి అయినా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వంశీకృష్ణ ఆ సారి నియోజకవర్గంలో బలం పుంజుకున్నారనే చెప్పాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి వెలగపూడి పోటీ చేయ‌క‌పోతే వంశీకృష్ణ గెలుస్తారని కూడా రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతూ ఉంటుంది.

జ‌న‌సేన ప్రభావ‌మెంత‌..?

అయితే వైసీపీ నుంచి వెలగపూడిని అన్ని విధాలా ఢీ కొట్టేందుకు ఎన్నికల టైమ్‌కు మరో అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతుందన్న ప్రచారం వంశీకృష్ణలో ఆందోళన కలిగిస్తోంది. ఇక్క‌డ జనసేనకు కేడర్‌ బలంగానే ఉంది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ రెండో స్థానంలో నిలవడం విశేషం. అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ జనసేనకు సామాజికవర్గపరంగా, పవన్‌ అభిమానులు పరంగా కేడర్‌ బలంగానే ఉన్నా సరైన నాయకులు లేకపోవడంతో కొంత ఆ పార్టీ కార్యక్రమాలు నిస్తేజంగా ఉన్నాయి. అయితే టిక్కెట్‌ వస్తుందని ఆశిస్తున్న కొందరు మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో యాదవులతో పాటు కాపులు కూడా భారీగానే ఉండడంతో జనసేన.. ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు భారీగా చీల్చుతుంద‌న్న‌ది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం విశాఖ తూర్పులో టీడీపీకి కొంత సానుకూల వాతావరణం ఉన్నా వైసీపీ కూడా అంతే ధీటుగా క‌నిపిస్తోంది. మరి ఎన్నికల టైమ్‌లో ఇది ఎలా ట్రెండ్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News