టార్గెట్… టీడీపీ కోలుకుంటుందా?

వైసీపీ సర్కార్ ఒక పద్ధతి ప్రకారం ఆక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో అక్రమారుల పనిపట్టేందుకు రంగం సిధ్ధం చేసింది. ఇందుకు విశాఖ నుంచే కధ [more]

Update: 2019-08-19 14:30 GMT

వైసీపీ సర్కార్ ఒక పద్ధతి ప్రకారం ఆక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో అక్రమారుల పనిపట్టేందుకు రంగం సిధ్ధం చేసింది. ఇందుకు విశాఖ నుంచే కధ మొదలుపెట్టింది. రూరల్ జిల్లా అనకాపల్లి మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాన్ని ఒక్క గునపం పోటుతో కూల్చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు బయలుదేరింది. అయిదేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన టీడీపీ నేత పీలాకు ఇపుడు కష్టకాలం దాపురించింది. ఆయన మాట అప్పట్లో మహా విశాఖ నగర పాలక సంస్థలో చెల్లుబాటు అయింది. ఇపుడు మాత్రం చెప్పా పెట్టకుండా అదే అధికారులు కూలగొట్టడం చూస్తూంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవని అర్ధమైపోయింది.

మాజీ మంత్రికి కూడా…

ఇదే ఊపులో జీవీఎంసీ అధికారులు మాజీ మంత్రి, నిన్నటి వరకూ విశాఖ అర్బన్ జిల్లాలో చక్రం తిప్పిన గంటా శ్రీనివాసరావుకు చెందిన భవనం కూడా అక్రమంగా కట్టారని నోటీసులు జారీ చేశారు. దాంతో గంటా బిల్డింగ్ కూడా రేపో మాపో కూల్చేస్తారని తెలిసిపోతోంది. ఇక అన్నింటికంటే కూడా నగరం నడిబొడ్డున ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఆకాశ హర్మ్యాలను తాకేలా కట్టిన టీడీపీ జిల్లా పార్టీ ఆఫీస్ మీద వైసీపీ నేతల కన్ను ఉందని అంటున్నారు. దాంతో దానికి కూడా నోటీసులు ఇప్పించి కూల్చేస్తారా అన్న అనుమానాలు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖలో ఎక్కడ చూసినా టీడీపీ తమ్ముళ్ళ అక్రమ కట్టడాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు. వారంతా నిబంధనలు ఉల్లఘించిన వారే కావడం విశేషం. మరి ఈ కధ ఎందాకా వెళ్తుందోనని పసుపు శిబిరం కలవరపడుతోంది.

పక్కా ప్లాన్ తోనే….

ఇక జీవీఎంసీ కమిషనర్ గా అప్పటివరకూ జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న జి సృజనను జగన్ సర్కార్ ఏరి కోరి ఎంపిక చేసింది. ఆమె ఇలాంటి విషయాల్లో చూసీ చూడన‌ట్లుగా వదిలే రకం అసలు కాదు. సృజన హయాంలోనే విశాఖ భూ కబ్జాల భాగోతం బయటకు వచ్చింది. దాని మీద కఠినంగా వ్యవహరించి నివేదికను కూడా సృజన తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. సుమారుగా వేయి ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని భూ కబ్జా చేశారని సృజన ఎటువంటి వత్తిళ్లకు తలవొగ్గకుండా నివేదికను పక్కాగా రూపొందించి పంపితే నాటి చంద్రబాబు సర్కార్ బుట్టదాఖలు చేసింది. అటువంటి సృజనను జీవీఎంసీలో నియమించడం ద్వారా టీడీపీ అక్రమార్కుల చిట్టా బయటకు తీయాలన్నదే జగన్ సర్కార్ పంతమని అంటున్నారు. ఇదిలా ఉండగా అక్రమ కట్టడాల కూల్చివేత ఇపుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో సెగలు, పొగలు సృష్టిస్తోంది. తమ మీద కక్ష సాధింపు చర్యలకు వైసీపీ సర్కార్ దిగుతోందని తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద కోర్టుని ఆశ్రయిస్తామని కొందరు అంటూంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News