వాణికి వైసీపీపై ఎందుకంత కోపం..?

అధికారంలోకి వచ్చారన్న మాటే కాని నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోఅధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటలేదు. కానీ [more]

Update: 2019-07-20 12:30 GMT

అధికారంలోకి వచ్చారన్న మాటే కాని నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోఅధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటలేదు. కానీ అధికారంలో ఉన్న నేతల మధ్య వైరుథ్యాలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారంలో ఉన్న ప్పటికీ కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కన్పిస్తుంది.

చివరి నిమిషంలో చేరి….

పెద్దాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి తోట వాణి వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న దొరబాబుకు టిక్కెట్ దక్కలేదు. తోట వాణి పార్టీలోకి చివరి నిమిషంలో రావడంతో ఆమెకే జగన్ టిక్కెట్ ఇచ్చారు. అయితే అప్పటి హోంమంత్రి, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పై తోట వాణి ఓటమి పాలయ్యారు.

రెండు వర్గాలుగా….

కానీ ఇటీవల పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పార్టీని రెండుగా చీలే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలు తోట వాణి, దొరబాబుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తో కలసి వైసీపీ నేత దొరబాబు కలసి పంపిణీ చేయడం వివాదాస్పదమయింది.

బీజేపీలో చేరతారని….

దీనిని తోట వాణి ఖండించారు. నియోజవర్గంలో తనకు తెలియకుండా పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారని తోట వాణి ప్రశ్నించారు. దీనిని జగన్ వద్ద పంచాయతీ కూడా పెట్టినట్లు తెలిసింది. తోట వాణి బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ఆమె ఇప్పటికే చర్చించారని కూడా చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం పెద్దాపురం సమన్వయ కర్త నియామకంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీని తోట వాణి వీడతారా? అన్నది చర్చనీయాంశమైంది. మరి కొద్ది రోజుల్లోనే పెద్దాపురం నియోజకవర్గం సమన్వయకర్తపై స్పష్టత రానుంది. అయితే తోట వాణి మాత్రం తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.

Tags:    

Similar News