ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని 'మోడీ' ఓకే చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే వివిధ కారణాలతో గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో ఉంది. అయితే... 'మోడీ' నియోజకవర్గాల పెంపుకు ఓకే చేస్తూ...సంబంధిత ఫైల్‌పై సంతకం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ ఆమోదం తరువాత.. వెంటనే ఫైల్ ఎన్నికల కమిషన్‌కు వెళుతుంది. అదే సమయంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించి చట్టసవరణ బిల్లును ప్రవేశపెడతారు.
ఆమోదం లాంఛనమేనా?
దీన్ని ఆమోదించడం లాంఛనమే. ఎందుకంటే...బిజెపి, కాంగ్రెస్‌లు రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గాల పెంపుకు అంగీకారం తెలిపాయి. దీంతో..ఇప్పుడు ఆ చట్టసవరణకు ఎటువంటి ఆటంకాలు వచ్చే..అవకాశం లేదు. సభ ఆమోదం పొందిన తరువాత ..ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225 సీట్లు అవుతాయి... తెలంగాణలో ఉన్న 119 సీట్లు 175కు పెరుగుతాయి. మొత్తం మీద మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పెంపుకు ప్రధాని ఆమోదించడం ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు మెలు చేయబోతుంది. అయితే కాంగ్రెస్ మాత్రం విభజన హామీలు పూర్తిగా అమలుచేస్తేనే నియోజకవర్గాల పెంపుకు మద్దతిస్తామన్న మెలిక పెడుతోంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు వచ్చే అవకాశముందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజుల్లో హోంశాఖ ఈ ఫైలును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుంది. ప్రధాని దానిని పరిశీలించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం కోసం పంపుతారు. మంత్రి వర్గం ఆమోదం పొందిన తర్వాత చట్టసభల ముందుకు తెస్తారు.