అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షునిగా రాహుల్ కుదురుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన ప్లీనరీతో తన విధానాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయగలిగారు. పార్టీలో తాను కోరుకున్న మార్పులకూ శ్రీకారం చుట్టారు. రెండు దశాబ్దాలకు పైగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మీడియా వ్యవహారాలకు నాయకత్వం వహించిన జనార్దన్ ద్వివేదీని తప్పించి ఆ స్థానంలో అశోక్ గెహ్లాట్ ను తీసుకోవడం పెనుమార్పుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంస్థాగత వ్యవహారాలు, కార్యకర్తలు, నాయకుల శిక్షణ బాధ్యతలకు సారథిగా ఆయనను నియమించారు. నూతనోత్తేజంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో రాహుల్ విమర్శలకు పదునుపెట్టడం, విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ప్రత్యర్థులపై బాగానే విరుచుకుపడుతున్నారంటున్నారు. ముఖ్యంగా నరేంద్రమోడీని ఎదుర్కోవడంలో రాహుల్ తేలిపోతున్నారన్నస్థాయి మారింది. ఫర్వాలేదు. రోజురోజుకీ రాటుదేలుతున్నారని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు. కాంగ్రెసు పార్టీకి, వ్యక్తిగతంగా రాహుల్ కు మంచి రోజులొస్తున్నాయనే భావన పార్టీలో నెలకొంది. జాతీయంగా ఒక బలమైన ప్రతిపక్షం ఏర్పడటం ప్రజాస్వామ్యానికి కూడా మంచి పరిణామమే.
గాడిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ...
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ జవజీవాలు కోల్పోయింది. ఒకదాని తర్వాత ఒక రాష్ట్రాన్నికోల్పోతూ నిస్తేజమై పోయింది. దేశవ్యాప్తంగా కమలం విస్తరించింది. నరేంద్రమోడీ తిరుగులేని నాయకునిగా, ఎదురులేని ప్రధానిగా ఆవిర్బవించారు. ఈ దశలో కాంగ్రెసు పార్టీ వృద్ధనాయకత్వం పార్టీని క్రియాశీలకంగా నడిపించగల పరిస్థితి లోపించింది. సోనియా పట్ల పార్టీలోనూ, మిత్రపక్షాల్లోనూ విధేయత ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో చురుకుగా వ్యవహరించలేకపోయారు. ఎట్టకేలకు రాహుల్ మెడలో వరమాల వేశారు. అంతకుముందునుంచే 2013 నుంచి పార్టీ ఉపాధ్యక్షుడిగా అనేక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ 2014 ఘోరపరాజయ భారం ఆయనపై కూడా పడింది. దాదాపు మూడేళ్లు పార్టీ అస్తిత్వమే కనుమరుగై పోతుందా? అన్నస్థాయిలో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. అయితే 2017 నుంచి పరిస్థితుల్లో మార్పు మొదలైంది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో దాదాపు అధికారంలోకి వచ్చినంత పోటీ ఇవ్వగలిగింది. 2018లో ఈ మార్పు కొనసాగుతూ పూర్తిస్థాయిలో పార్టీ పునరుత్థానం సాగుతుందని పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా మారుతుందనే నమ్మకాన్ని కాంగ్రెసు పార్టీనేతలు వ్యక్తం చేస్తున్నారు. వరసగా జరగనున్న కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల ఎన్నికలలో ముఖాముఖి పోటీ వాతావరణం కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ నమ్మకానికి ప్రధానకారణంగా కనిపిస్తోంది.
పెరుగుతున్న ఇమేజ్...
వారసత్వ పార్టీగా ముద్రపడిన కాంగ్రెసులో నాయకసామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏర్పడింది. గతంలో మోతీలాల్, జవహర్, ఇందిర,రాజీవ్ , సోనియాలు ఒకే కుటుంబం నుంచి నాయకత్వ బాధ్యత వహించారు. మోతీలాల్, జవహర్ ల కాలంలో కుటుంబ పార్టీగా కాంగ్రెసు పై ముద్ర లేదు. అగ్రనాయకత్వంలో వారు కూడా ఒక భాగంగానే ఉండేవారు. సందర్బాన్ని బట్టి అధ్యక్షస్థానం లభించింది. ఇందిర కాలం నుంచే చీలికలు పేలికల పాలై ఇందిర కాంగ్రెసు అవతరించింది. కాలక్రమంలో అదే జాతీయ కాంగ్రెసుగా స్థిరపడిపోయింది. కుటుంబం పార్టీ అవిభాజ్యంగా మారిపోయాయి. అప్పట్నుంచే నాయకుని కేంద్రంగానే కాంగ్రెసు నిర్వహణ సాగుతూ వస్తోంది. ఇందిర,రాజీవ్, సోనియా ముగ్గురూ కూడా సామర్ధ్యం విషయంలో తమనుతాము నిరూపించుకున్నట్లుగానే చెప్పాలి. రాజీవ్ గాంధీ సొంతంగా విజయాలు సాధించి పెట్టకపోయినప్పటికీ ఇందిర మరణం సానుభూతి పవనాల ప్రభావంతో 1984లో అప్రతిహత విజయాన్ని పార్టీకి అందించారు. రాహుల్ గాంధీ కాలం వచ్చేసరికి రాజకీయ ముఖ చిత్రం చాలా మారిపోయింది. గతంలో ఎన్నడూ కాంగ్రెసుకు పోటీగా బలమైన ఏకైక జాతీయప్రత్యామ్నాయ పార్టీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు బీజేపీ బలం కాంగ్రెసును మించిపోయింది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. రాహుల్ రాజకీయానుభవం పదిహేను సంవత్సరాల లోపు మాత్రమే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో మోడీ స్వయంకృతాపరాధాల కారణంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ వేత్త ఇప్పటికీ మోడీయే. కానీ గతంలో రాహుల్ కు నామమాత్రంగా ఉన్న ఫాలోవర్లు సంఖ్య ఇటీవలి కాలంలో మూడు రెట్లు పెరిగింది. ఎన్నికల సమయం నాటికి మోడీతో సమానంగా ఈ సంఖ్యను పెంచాలని కాంగ్రెసు సోషల్ నెట్ వర్కింగు విభాగం కృషి చేస్తోంది. వివిధాంశాలపై రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ రాహుల్ కూడా యువతతో కనెక్టు కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సమాచారం, సంధానం, విమర్శలు, ఆరోపణలపై సంక్షిప్త లేఖనం వంటివన్నీ నెట్ వర్కింగు విభాగం రాహుల్ కు సమకూర్చి పెడుతోంది. వీటికి తగినంత స్పందన లభిస్తూ రాహుల్ ఇమేజ్ పెరుగుతోంది. ప్రధాన స్రవంతిలోని మీడియా కూడా వీటిని తీసుకుని వార్తలుగా మలచుకోవాల్సి వస్తోంది. పెరుగుతున్న రాహుల్ ఆదరణకు ఇది నిదర్శనగా చెప్పుకోవాలి.
ఫ్రంట్ తంటాలు...
కాంగ్రెసు కేంద్రంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని, మోడీని నిరోధించవచ్చనేది సర్వత్రా వ్యాపించిన అభిప్రాయం. కానీ లౌకిక మూడో ప్రత్యామ్నాయం కావాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు కోరుకుంటున్నాయి. భిన్నమైన అభిప్రాయాలు , నాయకుల ఇగోల తో కూడిన పక్షాలు ఒకే వేదికపైకి వచ్చి కాంగ్రెసు, బీజేపీలను తలదన్నేలా బలమైన ఫ్రంట్ కట్టడం ఆచరణ సాధ్యమయ్యే అంశంగా కనిపించడం లేదు. ఓట్ల చీలిక బీజేపీకే లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కాంగ్రెసు పార్టీ అందరినీ కలుపుకుని పోవాలనే యత్నాలలో ఉంది. తొలి నుంచీ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం వంటి పార్టీలు కూడా కలిసి రావాలని కోరుకుంటోంది. కేరళ వంటి చోట్ల కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో రాజీ పడాలనే భావన కాంగ్రెసులో వ్యక్తమవుతోంది. మూడో ఫ్రంట్ ముసుగులో కేసీఆర్, శరద్ పవార్, మమతా బెనర్జీ వంటివారు వివిధ పార్టీలతో సంప్రతింపులు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగుతున్నారు. వీటిలో శరద్ పవార్, మమతా బెనర్జీ చివరికి కాంగ్రెసు ఫ్రంట్ కే ఓటేసే అవకాశాలున్నాయంటున్నారు. కేసీఆర్, చంద్రబాబునాయుడి వ్యూహాలు మాత్రం ఇంకా బహిర్గతం కావడం లేదు. ఫ్రంట్ నిజంగా రూపుదాలిస్తే ఎవరి కొంప ముంచుతుందోననే భయాందోళనలు కూడా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్