ఇంతే సంగతులు..చిత్తగించవలెను…!!

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంత పార్టీకి చెందిన నేతలే తమను మోసం చేశారని ఇటు [more]

Update: 2019-07-27 18:29 GMT

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంత పార్టీకి చెందిన నేతలే తమను మోసం చేశారని ఇటు కాంగ్రెస్, అటు జనతాదళ్ ఎస్ లు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 12 మంది, జనతాదళ్ ఎస్ కు ముగ్గురు శాసనసభ్యులు అసంతృప్తితో వెళ్లిపోవడానికి గల కారణాలను రెండు పార్టీలూ విశ్లేషించుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను తప్పుపట్టేకంటే… మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందని కొందరు నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడినట్లు తెలిసింది.

చేతకాని తనం వల్లనేనంటూ….

రెండు రోజల క్రితం కుమారస్వామి ప్రభుత్వం కర్ణాటకలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందులో బీజేపీ లోపాలను ఎత్తిచూపడానికి లేదు. ఎందుకంటే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ అసంతృప్తితో బయటకు వచ్చిన వారే. ఇందుకు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది జరుగుతుందని ముందే ఊహించినా కాంగ్రెస్ నేతలు కట్టుబాటు చేయలేకపోయారని జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సిద్దరామయ్యకు చెందిన వర్గానికి చెందిన వారే అసంతృప్తితో వెళ్లిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఒంటెత్తు పోకడలతోనే….

ఇక కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కుమారస్వామి, రేవణ్ణ ఒంటెత్తు పోకడల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కుమారస్వామి సక్రమంగా అందరినీ చూసుంటే అసంతృప్తి ఎందుకు తలెత్తేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ను రెండుగా చీల్చేందుకు కుమారస్వామి ప్రయత్నించారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. అందువల్లనే కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిందని, జేడీఎస్ ఎమ్మెల్యేలు వెళ్లడానికి కూడా కుమారస్వామి కారణమని అంటున్నారు.

సయోధ్య కష్టమే…..

దీంతో రెండు పార్టీల మధ్య ఇక సయోధ్య కొనసాగడం కష్టమేనన్నది ఇరు పార్టీల నుంచి విన్పిస్తున్న మాట. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీలో కూడా రెండు పార్టీల మధ్య తేడాలొచ్చాయి. ప్రచారంలోనూ ఒకరి ప్రాంతంలో మరొకరు పాల్గొనకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై సిద్ధరామయ్య, దేవెగౌడ చర్చలు జరిపినా ఫలించలేదు. ఇక సర్కార్ కుప్పకూలిపోవడంతో భవిష్యత్తులో జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉండే అవకాశమే లేదన్నది విశ్లేషకుల మాట. ఇలా కన్నడ నాట సంకీర్ణ సర్కార్ లో ఉన్న రెండు పార్టీలు త్వరలో ఎవరి దారి వారు చూసుకోనున్నాయి.

Tags:    

Similar News