ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబు నాయుడు హోం మంత్రి అమిత్ షా పాదాలకు మొక్కలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. మే 2024లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. మే 2024లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ చీఫ్ ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీ నేతలు అమిత్ షాతో భేటీ అయ్యారు. జనసేన పార్టీతో కలిసి బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం సాగుతూ ఉంది.
ఇలాంటి పరిణామాల మధ్య.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా పాదాలకు నమస్కరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు అమిత్ షా పాదాలను తాకినట్లు వే 2 న్యూస్‌లో న్యూస్ షార్ట్ వచ్చిందని కొందరు పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
“అమిత్ షా కాళ్లు మొక్కిన చంద్రబాబు! బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షా కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, 22 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థులుగా విశాఖ నుంచి పురందేశ్వరి, రాజమండ్రి నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్, నరసాపురం నుంచి రఘురామకృష్ణ, విజయవాడ నుంచి సుజనా చౌదరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.” అంటూ ఆ ఫోటో కింద ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు.
షార్ట్ న్యూస్ యాప్ 'వే2న్యూస్' సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను సెర్చ్ చేశాం. వైరల్ చిత్రం తమ వార్తా కథనానికి సంబంధించినది కాదని పేర్కొంటూ ఆ సంస్థ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము. క్యాప్షన్‌లో “ఇది #Way2News కథనం కాదు. కొంతమంది మా లోగోను ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది @way2news ద్వారా పబ్లిష్ చేయలేదని మేము ధృవీకరిస్తున్నాము” అంటూ అందులో వివరంగా తెలిపారు.
వైరల్ అవుతున్న చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం.. చంద్రబాబు నాయుడు వంగి ఉన్న చిత్రం యూట్యూబ్ థంబ్‌నెయిల్ నుండి తీసుకున్నారని మేము కనుగొన్నాము. చంద్రబాబు నాయుడు యోగా ఆసనాలు వేస్తున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్. ఈ వీడియో జూన్ 21, 2018న ప్రచురించారు. చంద్రబాబు నాయుడు 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు.
వీడియోలో అదే భంగిమను చూడలేనప్పటికీ, వీడియోకు సంబంధించిన థంబ్ నెయిల్ లో అదే చిత్రాన్ని ఉంచారు. చిత్రాలకు సంబంధించిన పోలిక.
నిజానికి.. చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయినప్పటికీ.. సమావేశంలో ఏమి జరిగింది, అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. వైరల్ అవుతున్న చిత్రం మాత్రం ఒరిజినల్ కాదు. అది మార్ఫింగ్ చేశారని మేము ధృవీకరించాం.
Claim : Viral image shows Telugu Desam Party chief Chandrababu Naidu touching Amit Shah’s feet
Claimed By : Social media users
Fact Check : False