ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో జైపూర్ LPG టాంకర్ పేలుడుకు సంబంధించింది కాదు
ఇది లెబనాన్ లో జరిగిన ఘటన
జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పిజి ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది, ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో మరో వ్యక్తి తీవ్ర కాలిన గాయాలతో మరణించాడు. SMS ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుశీల్ భాటి, "ప్రస్తుతం ఆసుపత్రిలో ఏడుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు" అని డిసెంబర్ 28, 2024న తెలిపారు. డిసెంబర్ 20న ఎల్‌పిజి ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టడంతో భారీ పేలుడు జరిగింది. దీంతో జైపూర్-అజ్మీర్ హైవేలో 35 వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన రోజే 11 మంది మృతి చెందారు.
అయితే ఈ ఎల్‌పిజి ట్యాంకర్ డ్రైవర్, భారీ అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకున్నాడు. డ్రైవర్‌ను మధురకు చెందిన జైవీర్‌గా పోలీసులు గుర్తించారు. అతనిని జైపూర్‌కు విచారణ కోసం పిలిచారు. పోలీసు అధికారి మనీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ కావడానికి ముందు అతను డేంజర్ జోన్ నుండి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ యజమానికి డ్రైవర్ ఫోన్ చేసి ప్రమాదం గురించి తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 20 తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటూ ఉండగా బెడ్‌షీట్‌లతో వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్‌పై ఉన్న నాజిల్‌లు, సేఫ్టీ వాల్వ్‌లు విరిగిపోయి గ్యాస్ లీక్ అయింది. కాసేపటికే భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటల్లో చిక్కుకోగా అక్కడికి దగ్గరలోనే వాహనాల్లో ఉన్న వాళ్లు తప్పించుకునేందుకు సమయం దొరకలేదు. పలువురు సజీవదహనం అయ్యారు.
అయితే ఈ పేలుడుకు సంబంధించిన వీడియో అంటూ కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. ఓ బిల్డింగ్ పై నుండి వీడియోను తీస్తూ ఉండగా దూరంగా ఓ భారీ పేలుడు సంభవించింది. అది ఇతర ప్రాంతాలకు తాకింది. ఈ వీడియో మీద జైపూర్ ఎల్.పీ.జీ. అని ఉంది. ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోకు జైపూర్ లో ఘటనకు ఎలాంటి సంబంధం లేదని మేము ధృవీకరించాం. లెబనాన్ రాజధాని బీరుట్ లో చోటు చేసుకున్న ఘటన అని ధృవీకరించాం.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
"Beirut explosion: Hero nurse saves three newborn babies as blast rocks hospital" అంటూ 5 ఆగస్టు 2020న https://www.mirror.co.uk/ లో ఓ కథనాన్ని చూశాం. దీన్ని బట్టి ఈ వీడియో బీరుట్ లో చోటు చేసుకుందని తెలుస్తోంది.
మరిన్ని రిజల్ట్స్ ను పరిశీలించగా ఆగస్టు 5, 2020న అప్‌లోడ్ చేసిన NBC న్యూస్ YouTube ఛానెల్‌లో ఈ వీడియోను కనుగొన్నాము. వీడియో వివరణలో “లెబనాన్‌లో భారీ పేలుడు సంభవించింది డజన్ల కొద్దీ మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ” అని ఉంది.
వైరల్ వీడియో, NBC న్యూస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియో కూడా ఒకటేనని మేము ధృవీకరించాం.
దీన్ని క్యూగా తీసుకుని మేము బీరుట్ పేలుళ్లకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో వెతికాం. పలు ప్రముఖ మీడియా సంస్థలు ఈ ఘటన బీరుట్ లో చోటు చేసుకుందని ధృవీకరించారు.
ఆగష్టు 4, 2020న, లెబనాన్‌లోని బీరూట్‌లో సాయంత్రం 6:07 గంటలకు, నిల్వ చేసిన 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలింది. అనేక చిన్న పేలుళ్ల తర్వాత ఓ భారీ పేలుడు సంభవించింది. దీని ఫలితంగా 6000 మందికి పైగా గాయపడ్డారు, 200 మంది మరణించారు. 3,00,000 మంది ప్రభావితమయ్యారు. 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టం జరిగింది. నగరం లోని ప్రధాన భూభాగాన్ని నాశనం చేసింది. పేలుడు శబ్దం 200 కిలోమీటర్లకు పైగా వినిపించింది.
వైరల్ వీడియోకు, జైపూర్ లో ట్యాంకర్ పేలుడుకు ఎలాంటి సంబంధం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now