ఫ్యాక్ట్ చెక్: వరంగల్ జిల్లాలో పులి కనిపించిందన్న వాదన అబద్దం
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శివారులోని రుద్రగూడెం గ్రామంలో పులి పాదాల గుర్తులు కనిపించడంతో వరంగల్ అటవీశాఖ రుద్రగూడెం;
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శివారులోని రుద్రగూడెం గ్రామంలో పులి పాదాల గుర్తులు కనిపించడంతో వరంగల్ అటవీశాఖ రుద్రగూడెం అటవీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. ఈ గుర్తులను గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని అవి పులివేనని నిర్ధారించారు. పులి రుద్రగూడెం గ్రామ శివారులో సంచరించిందని, బహుశా ములుగు జిల్లా నుండి వలస వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపూర్, ఊటై అటవీ ప్రాంతాల వైపు కూడా పులి వెళ్లినట్లు భావిస్తున్నారు.
అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు 15 మందితో కూడిన అటవీ సిబ్బంది రంగంలోకి దిగారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. గొర్రెల కాపరులు కూడా పశువులను మేపడం కోసం అడవిలోకి వెళ్లవద్దని కోరారు. వీటన్నింటి మధ్య, వరంగల్‌లోని నల్లబెల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందంటూ చెట్ల మధ్య పులి తిరుగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “నల్లబెల్లి మండలం లో పెద్దపులి సంచారం #polasatv #tiger #shorts” అంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
“వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంట పొలాల్లో నుంచి ఖానాపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు పులి కోసం వెతుకులాట ప్రారంభించిన @TelanganaForest, @warangalpolice” అంటూ పోస్టులు పెట్టారు.
నల్లబెల్లి మండలం రుద్రగూడెం కాకతీయ స్కూలు వెనకాల ..నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంట పొలాల్లో నుంచి ఖానాపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం. వరంగల్ జిల్లా..లో పులి భయాందోళనలో రైతులు, గ్రామస్తులు. పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు, పోలీస్ అధికారులు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పులి కనిపించిందంటూ పలు రకాల వాదనలతో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2020 సంవత్సరం నుండి ఆన్‌లైన్‌లో ఉంది. మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతకగా.. వీడియో 2020 సంవత్సరం నుండి ఆన్‌లైన్‌లో ఉందని నిర్ధారించే వీడియోలు, వార్తల నివేదికలను మేము కనుగొన్నాము.
‘సిల్వానీ కే జంగిల్ మే పాయా గయా షేర్’ అనే క్యాప్షన్‌తో రాజేంద్ర బాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను మేము కనుగొన్నాము. 'సిల్వాని అటవీ ప్రాంతంలో పులి కనుగొన్నారు’ అని టైటిల్ కు అర్థం వస్తుంది. ఈ వీడియోను డిసెంబర్ 6, 2021న అప్లోడ్ చేశారు.
ఉత్తరాఖండ్ సమాచార్ రామ్‌గఢ్ అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని పేర్కొంటూ వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌లను పంచుకుంది.
సోమేష్ సింగ్ ఠాకూర్ అనే యూట్యూబ్ ఛానల్ లో బస్తర్ అడవిలో పులి కనిపించిందని పేర్కొంటూ అదే వైరల్ వీడియో ఉన్న సుదీర్ఘమైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నవంబర్ 28, 2020న అప్లోడ్ చేశారు.
ఈ వీడియో తీసిన ప్రదేశంపై సరైన నిర్ధారణ లేకున్నా, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఇటీవల పులి కనిపించిందంటూ వైరల్ వాదన నిజం కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Claim : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పులి సంచారం చూపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది
Claimed By : Social media users
Fact Check : False