ఫ్యాక్ట్ చెక్: టంగుటూరు టోల్ గేట్ దగ్గర అనధికారికంగా డబ్బులు వసూలు అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పాడైన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ద్వారా ఏపీలో రోడ్ల పరిస్థితి మెరుగు పరచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోందని వార్తలు కూడా వచ్చాయి.
అయితే కొందరు వ్యక్తులు రోడ్లపై డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది. ℍ𝕖𝕝𝕝𝕠 𝕆𝕟𝕘𝕠𝕝𝕖 అనే పేజీలో సెప్టెంబర్ 26, 2024న వీడియోను పోస్టు చేశారు.
"మిత్రులారా గమనించండి. ఈ వీడియో ఏంటంటే ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ దగ్గర కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒక కారు పెట్టుకొని మేము రోడ్డు సేఫ్టీ వాళ్ళం స్టిక్కర్లు అంటిస్తాం అని చెప్పి 100, 200 ఇవ్వాలి అని డిమాండ్ చేయడం చేస్తున్నారు. ఈ విషయంలో నేను ఈరోజు ఉదయం వాళ్ళని పట్టుకొని మీ పర్మిషన్ లెటర్ ఏది? మిమ్మల్ని ఎవరు వసూలు చేయమన్నారు? ఆర్టీవో గారు బ్రేక్ చేసిన తర్వాత కదా బండి రోడ్డు మీదకు వస్తుంది మరి మళ్ళీ ఆయన స్టిక్కర్ వేయలేదని లేకపోతే ఆర్టీవో రూల్స్ తెలియదేనా అని గట్టిగా పట్టుకునిటంగుటూరు ఎస్సై గారికి మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్లు కూడా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. నేను కూడా గట్టిగా దబా ఇస్తే వాళ్ల కారులో వెళ్లిపోయారండి. మీరు ఎవరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి ఇదంతా ఫేక్ గ్యాంగ్ అండి బెదిరిస్తే వెళ్ళిపోతున్నారు, లేకపోతే వసూలు చేస్తున్నారు. కాబట్టి గమనించుకొని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆపినప్పుడు ఆపాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఎటువంటి అథారిటీ లేదు గమనించండి
#helloongole #prakasam #prakasamdistrict #prakasamissues #ongole #andhrapradesh #prakasampolice" అంటూ పోస్టు పెట్టారు.
పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోలేదని ఏపీ పోలీసులు తెలిపారు.
వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది కాదంటూ ఏపీ పోలీసులు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
"An old video from another State is being circulated as a video shot in Prakasam District of Andhra Pradesh State. Kindly note that this account holder will be liable for prosecution under various acts for circulating this fake video." అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాలో డిసెంబర్ 14న పోస్టు పెట్టారు.
వేరే రాష్ట్రానికి చెందిన పాత వీడియోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చిత్రీకరించిన వీడియోగా చెబుతున్నారు. ఈ నకిలీ వీడియోను సర్క్యులేట్ చేసినందుకు సంబంధిత ఖాతాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు తెలిపారు.
ఏపీ పోలీసుల పోస్టును మంత్రి నారా లోకేష్ కూడా రీట్వీట్ చేశారు. "ఇందుకే బ్రో మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. ప్రజలు ఛీ కొట్టినా మీ బుద్ధి ఏ మాత్రం మారకపోవడం బాధాకరం. ప్రభుత్వ నుండి చిన్న తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధం. కానీ పనిగట్టుకొని ఫేకు ప్రచారం చేస్తే తాటతీస్తాం.
#FekuJagan
#AndhraPradesh" అంటూ హెచ్చరించారు.
వైరల్ వీడియో నిజంగా ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మేము స్వతహాగా ధృవీకరించలేకపోయినప్పటికీ, ఏపీ పోలీసులు మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన కాదు.. ఇతర రాష్ట్రంలో జరిగిన ఘటన అని చెబుతున్నారు.
ఘటన చోటు చేసుకున్న ప్రదేశానికి సంబంధించిన మరింత సమాచారం దొరకగానే ఈ కథనాన్ని తప్పకుండా అప్డేట్ చేస్తాం.
Claim : కూటమి ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ డబ్బులు వసూలు చేస్తున్నారు
Claimed By : Social Media Users
Fact Check : False