ఫ్యాక్ట్ చెక్: అందమైన ఫ్లెమింగోలను చూపే వీడియో కజకిస్థాన్ కు చెందినది, ముంబై ది కాదు
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో, కచ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, టర్కీ నుండి ఫ్లెమింగోలు ముంబైకు వచ్చాయి.
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో, కచ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, టర్కీ నుండి ఫ్లెమింగోలు ముంబైకు వచ్చాయి. ప్రతి సంవత్సరం నవంబర్‌లో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు ముంబైకి వలస వస్తాయి. ఇక్కడి నేలలను కొన్ని నెలల పాటు నివాసంగా మార్చుకుంటాయి. ఎక్కువగా ఆహారం, నీటి కోసం ఇక్కడికి వలస వస్తుంటాయి. చిత్తడి పరిస్థితులు, ఆల్గే సమృద్ధిగా ఉన్న జలాలను కలిగి ఉన్న తీరప్రాంతాలను ఫ్లెమింగోలు ఇష్టపడతాయి.
భారతదేశంలో ఫ్లెమింగోలను గుర్తించే ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి థానే క్రీక్. థానే క్రీక్ మహారాష్ట్రలోని రెండవ సముద్ర అభయారణ్యం. ఆగస్ట్ 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని 'ఫ్లెమింగో అభయారణ్యం'గా ప్రకటించింది. 1994 నుండి ప్రజలు వివిధ జాతుల వలస పక్షులను ఈ ప్రాంతంలో గుర్తించారు.
ఫ్లెమింగోలు ప్రతి సంవత్సరం థానే క్రీక్‌కి వస్తాయి. ఇక్కడ లభించే నీలం-ఆకుపచ్చ ఆల్గేలను తింటాయి. తమ సంతానోత్పత్తికి సొంత ప్రాంతాలకు వెళ్లే ముందు, శీతాకాలంలో ఆరు నుండి ఏడు నెలల వరకు ఇక్కడే ఉంటాయి. చలికాలం కావడంతో ఫ్లెమింగోలు కూడా పలు ప్రాంతాల నుంచి ముంబైకి వలస రావడం ప్రారంభించాయి. ఈ వలసల దృష్ట్యా ఈ గులాబీ రంగు పక్షులు ముంబైకి చేరుకున్నాయని పేర్కొంటూ ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. "శీతాకాలపు అతిథులు సమయానికి వచ్చారు! " అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియో కజకిస్తాన్‌కి చెందినది.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వేత్తగా, ఆ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 2020లోనే ప్రచురించారని మేము కనుగొన్నాము. Fox 10 Phoenix అనే ఫేస్ బుక్ పేజీలో నవంబర్ 2020న “FLOCKING FLAMINGOS: The flamingos of Lake Karakol in Kazakhstan migrate south as winter approaches, creating what seems like a floating, pink island in the middle of the water” అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు.
ఫాక్స్ 10 ఫీనిక్స్ ప్రచురించిన కథనం ప్రకారం, నవంబర్ 14న కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలోని కరాకోల్ సరస్సుపై ఫ్లెమింగోల గుంపు వలస వచ్చినప్పుడు చిత్రీకరించారు. అజామత్ సర్సెన్‌బయేవ్ చిత్రీకరించిన డ్రోన్ ఫుటేజ్ సరస్సు దగ్గర ఎగురుతున్న గులాబీ రంగు పక్షులను చూపిస్తుంది.
స్థానిక వార్తా నివేదిక Google అనువాదం ప్రకారం, ఫ్లెమింగోలు వలస సమయంలో తరచుగా అక్టౌ సమీపంలో కనిపిస్తాయి, ఆ తర్వాత అవి దక్షిణాన తుర్క్‌మెనిస్తాన్‌లోని ఖాజర్ నేచర్ రిజర్వ్ లేదా ఇరాన్‌కు వెళ్లిపోతాయి.
CBS News ఫేస్ బుక్ పేజీలో కూడా “Watch as hundreds of pink flamingos rest on a lake in Kazakhstan" అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
మంగిస్టౌ ప్రాంతంలోని కరకోల్ సరస్సు సమీపంలో పింక్ ఫ్లెమింగోలు ఉన్న వీడియో కజఖ్ సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యపరిచినట్లుగా మరొక కథనం పేర్కొంది. ఓ వీడియో డ్రోన్ ఫుటేజ్ రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది. ఫ్లెమింగోలు ప్రతి శరదృతువులో ఖాజర్ రిజర్వ్‌కు లేదా ఇరాన్‌కు వెళ్లే మార్గంలో మాంగిస్టౌ ప్రాంతానికి వస్తాయి. కారకోల్ సరస్సులో అక్టోబర్ ప్రారంభంలో స్థానికులు మొదటి పక్షుల గుంపును గమనించారు. వలస నీటి పక్షులకు ముఖ్యమైన చిత్తడి నేల ప్రాంతం అయిన కోర్గల్‌జైన్ స్టేట్ నేచర్ రిజర్వ్ వద్ద ఉన్న టెంగిజ్, కోర్గల్‌జైన్ సరస్సుల నుండి పక్షులు వచ్చాయి. రిజర్వ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్ నెట్‌వర్క్‌లో జాబితాలో ఉంచారు. కజకిస్తాన్‌కు ఏటా వచ్చే ఫ్లెమింగోల సంఖ్య దాదాపు 50,000-100,000 వరకూ ఉంటుంది.
ఇండియా టుడే కూడా 2020 సంవత్సరంలో వైరల్ వీడియోను షేర్ చేసింది. వేలాది ఫ్లెమింగోలు కజకిస్తాన్ నుండి బయలుదేరాయని అందులో నివేదించింది.
వైరల్ వీడియో కజకిస్తాన్ లో చిత్రీకరించింది, ముంబైకు చెందినది కాదని మేము ధృవీకరించాం. ఇది ఫ్లెమింగోల వలసల సీజన్, వేల సంఖ్యలో నవీ ముంబైకి చేరుకున్నప్పటికీ, వైరల్ వీడియో ముంబైలో చిత్రీకరించలేదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము ధృవీకరించాం.
Claim : 2024 సంవత్సరం శీతాకాలంలో నవీ ముంబైకి వచ్చిన ఫ్లెమింగోలను చూపుతోంది
Claimed By : Twitter users
Fact Check : Misleading