ఫ్యాక్ట్ చెక్: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారనే వాదన నిజం కాదు

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రసిద్ధ సంగీత స్వరకర్త. ఆయన 7000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. 1000 కంటే ఎక్కువ సినిమాల

Update: 2024-12-18 07:35 GMT

Ilayaraaja 

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రసిద్ధ సంగీత స్వరకర్త. ఆయన 7000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. 1000 కంటే ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ ను అందించారు. 20000 కంటే ఎక్కువ కచేరీలలో ప్రదర్శనలు ఇచ్చారు. 40 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 15 జాతీయ చలనచిత్ర అవార్డులు, భారతదేశపు మూడవ పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. ఇళయరాజా తన వినూత్నమైన, విలక్షణమైన సంగీత శైలికి ప్రసిద్ధి చెందారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద, పాశ్చాత్య శాస్త్రీయ, జాజ్, రాక్ వంటి వివిధ శైలులను కలిపిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో గొప్ప గొప్ప ఆల్బమ్స్ సంగీత ప్రియులకు అందించారాయన.



ఇళయరాజా డిసెంబర్ 15, 2024 న తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన స్వరపరిచిన 'దివ్య పాసురం' విడుదలకు ముందు , ఆలయ అధికారులు ఆయనను ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదనే వాదనతో ప్రచారం చేస్తున్నారు. “हिंदुओं ने छुआछूत के ख़िलाफ़ लड़ाई लड़ी? बेशर्म ये आज ही की ख़बर है पढ़ ले एक सांसद को मंदिर में घुसने से रोक दिया गया है “ అంటూ హిందీలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. "ఇంకా అంటరానితనం ఉందా? హిందువులు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారా? ఒక ఎంపీని గుడిలోకి రానీయకుండా అడ్డుకున్నారు “ అని అందులో ఉంది.


క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
ఇళయరాజా దళితుడైనందున శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేదు. గర్భగుడిలోకి భక్తులను ఎవరినీ అనుమతించని కారణంగా ఆయన్ను లోపలికి వెళ్లనివ్వలేదు.
కీలకపదాలను ఉపయోగించి శోధించినప్పుడు, ఈ సంఘటనకు సంబంధించిన అనేక వార్తా కథనాలను మేము కనుగొన్నాము. ఓ X వినియోగదారు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న పోస్ట్‌ను మేము కనుగొన్నాము. సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను ఒకే విధంగా ఆలయంలో గౌరవిస్తారని చెప్పారు. పూజారులను మాత్రమే గర్భగుడిలోకి అనుమతిస్తారని, సాధారణ ప్రజలను కాదంటూ తెలిపారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని కథనం ప్రకారం, శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన శ్రీ శతకోప రామానుజ జీయర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, ఇళయరాజాకు హిందూ మత, ధర్మాదాయ శాఖ జాయింట్ కమీషనర్ కె సెల్లతురై స్వాగతం పలికారు.
షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి ముందు, ఇళయరాజా, కొంతమంది పూజారులు ఆండాళ్ సన్నిధి (గర్భస్థలం), నందనవనం (ఆలయ ఉద్యానవనం), పెరియ పెరుమాళ్ సన్నిధితో సహా ఆలయ ప్రధాన గర్భాలయాలకు వెళ్లారు.
హిందూ మత, ధర్మాదాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఆండాళ్ సన్నిధిలో, భక్తులు సాధారణంగా వసంత మండపం నుండి ప్రార్థనలు చేస్తారు, ఇది అర్ధమండపం వెలుపల ఉన్న మంటపం. గర్భగుడిలోకి వెళ్ళే మధ్యవర్తి ప్రదేశం. ఇళయరాజా, సీనియర్ అర్చకులతో కలిసి అర్థమండపం ముఖద్వారం వద్దకు రాగా, వసంత మండపం దాటి ప్రవేశం లేదని అర్చకులు తెలియజేశారు. ఇళయరాజా ఆ ప్రాంతం నుండి తన ప్రార్థనలు చేసారు." అని వివరించారు.
ఆలయ సందర్శన అనంతరం ఇళయరాజాను ఆండాళ్ మాలలు, పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆ తర్వాత ఆది పూరం కొత్తగైలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు, అక్కడ సంగీతకారులు తన ‘దివ్య పాసురం’ ఆల్బమ్‌లోని ఆండాళ్ పాసురాలను ప్రదర్శించారు. తర్వాత భరతనాట్య ప్రదర్శన జరిగింది. మార్గశిర మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో ఆలయం వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
అవన్నీ పుకార్లు అంటూ ఇళయరాజా కొట్టిపారేశారు. ఇళయరాజా తన ఎక్స్‌ ఖాతాలో 'కొందరు నా విషయమై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. నేను ఏ సమయంలో లేదా ప్రదేశంలో నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను. జరగని వార్తలను జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు వదంతులను నమ్మవద్దు.' అంటూ వివరణ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
దళితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ


Claim :  మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను దళితుడైన కారణంగా ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారు
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News