మహాకుంభమేళా 2025 జనవరి 13న ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంభమేళా కోసం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేశారు. కుంభమేళాకు హిందూ మతంలో గొప్ప స్థానం ఉంది. మహా కుంభమేళా గొప్ప మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మూడు నదులు కలిసే త్రివేణి సంగమం ఉన్న ప్రయాగ్‌రాజ్ ను కుంభమేళా సమయంలో అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. 2025 మహా కుంభమేళా చాలా అరుదైనది, 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, ఇది అత్యంత అరుదైన సందర్భం.
మహా కుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక అధికారులు ఈ సమయంలో 1.5 నుండి 2 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. వసతి, పారిశుధ్యం, భద్రత, వైద్య సౌకర్యాల కోసం సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాకు యాత్రికులు, సాధువులు తరలివస్తుంటారు. నాగ సాధువులు కూడా దీక్షను పూర్తీ చేసి ఇక్కడకు చేరుకుంటారు. కుంభమేళా సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏనుగులు, గుర్రాలు, రథాలపై సాంప్రదాయిక ఊరేగింపు నిర్వహిస్తారు. మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షించే అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడతారు.
కొన్ని అద్భుతమైన సంఘటనలు, సాహసాలకు సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి మహా కుంభమేళాలో చోటు చేసుకున్న సంఘటనలు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. వీటిలో కొన్ని వీడియోలు మహా కుంభమేళాకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తి అగ్నితో విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి హిందీలో “ प्रयागराज में इस बार का कुंभ ऐतिहासिक है , तो प्रयास करें इस महाकुंभ में सम्मिलित होने का और कुछ अनोखी यादें संजोने का ... हर हर महादेव” అంటూ వైరల్ అవుతూ ఉంది. "ప్రయాగ్ రాజ్ లో నిర్వహించే కుంభమేళా చారిత్రాత్మకమైనది, ప్రయాగ్ రాజ్ ను సందర్శించి మీరు సరికొత్త అనుభూతులను సొంతం చేసుకోండి" అని అందులో ఉంది.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోకు, మహాకుంభమేళాకు ఎలాంటి లింక్ లేదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసాము. అనేక మంది చైనీస్ Facebook వినియోగదారులు పలు సారూప్య వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
‘令人震撼的火壶表演,为中国非遗点赞! Shocking fire pot performance, praise for Chinese intangible heritage! #Amazing#China#Culture’ అంటూ వైరల్ వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
మరో Facebook వినియోగదారుడు ఇదే వీడియోను అక్టోబర్ 2, 2024న షేర్ చేశారు.
చైనా ప్లస్ కల్చర్ ప్రచురించిన పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. ఈ సాంస్కృతిక బ్లాగర్ వున్వ్‌జౌ, షాంగ్రావ్ సిటీ, జియాంగ్జీ ప్రావిన్స్‌లో 'ఫైర్ పాట్' ప్రదర్శనను చూపించారు. ఫైర్ పాట్ ప్రదర్శన చైనా సాంస్కృతిక వారసత్వం. ఇది పలు వ్యాధులను తరిమికొట్టడం, విపత్తులను నివారించడం, ఇంటిలో శాంతి నెలకొనడానికి కారణమవుతుందని భావిస్తారు.
తదుపరి శోధనలో చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా
CCTV ద్వారా భాగస్వామ్యం చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము. నవంబర్ 2024న ప్రచురించిన కథనాల్లో ‘గన్సు ప్రావిన్స్‌లోని వువీ సిటీలో' ఈ సాంప్రదాయక కళారూపాన్ని ప్రదర్శించారని తెలిపారు.
అగ్నితో ప్రదర్శనలు చేస్తున్న వైరల్ వీడియో ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు సంబంధించింది కాదు. ఇది చైనాలో రికార్డు చేసిన వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.