ఫ్యాక్ట్ చెక్: దేశంలో పెరిగిన శ్వాసకోశ వ్యాధుల కారణంగా చైనా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించలేదు.
COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అయింది. ఐదు సంవత్సరాల తర్వాత మరో వైరస్ చైనాలో పుట్టిందనే ప్రచారం సాగుతూ ఉంది;
COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అయింది. ఐదు సంవత్సరాల తర్వాత మరో వైరస్ చైనాలో పుట్టిందనే ప్రచారం సాగుతూ ఉంది. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి ఇప్పుడు చైనాను భయపెడుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఆసుపత్రులలో భారీ సంఖ్యలో ప్రజలు ఉన్న వీడియోలను, చిత్రాలను పంచుకుంటున్నారు. ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19తో సహా పలు వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా జరుగుతూ ఉందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు చైనాలో ఏకంగా ఎమర్జెన్సీని ప్రకటించారనే ప్రచారం చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీని చైనా ప్రకటించిందనే వాదనతో ఆసుపత్రులలో భారీ ఎత్తున జనం ఉన్న వీడియోలను పంచుకుంటున్నారు. "బ్రేకింగ్: ప్రజలతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. శ్మశానాలలో ఊహించని విధంగా పరిస్థితి ఉంది. చైనా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, COVID-19తో సహా పలు వైరస్‌లు చైనా అంతటా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి." అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు.
మరికొంతమంది వినియోగదారులు ఆసుపత్రులతో పాటు శ్మశాన వాటికల వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. "చైనా అత్యవసర పరిస్థితిని జారీ చేసింది. రెండు రోజుల్లో 300 మందికి పైగా మరణించారు. యువత, వృద్ధులతో అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. శ్మశాన వాటికలలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వైరస్లు చైనాలో ఉద్భవించాయి. డాక్టర్లను కలవాలన్నా కూడా చాలా సమయం పడుతోంది" అని పోస్టుల్లో తెలిపారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల గురించి కథనాలు వచ్చినా అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఉంటుందని అంచనా వేశారు. న్యుమోనియా కేసులు కూడా పెరుగుతూ ఉండడంతో అధికారులు అడ్డుకోడానికి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాట్లు చేశారు. నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాధి నియంత్రణ, నివారణపై పలు చర్యలు తీసుకుందని చైనాకు చెందిన బ్రాడ్‌కాస్టర్ CCTV నివేదించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక అధికారులు చెప్పినట్లుగా మీడియా సంస్థలు నివేదించాయి.
శీతాకాలంలో చైనాలో వివిధ శ్వాసకోశ అంటు వ్యాధుల బారిన ప్రజలు పడే అవకాశం ఉందని NDTV మరొక నివేదిక తెలిపింది. కాన్ బియావో అనే అధికారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉందని వివరించారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో మెటాప్‌న్యూమోవైరస్ ప్రభావం చూపుతూ ఉందని, ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) శ్వాసకోశ వైరస్.. 2001లో మొదటిసారిగా గుర్తించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు ఈ వైరస్ కారణమవుతోంది. సాధారణ లక్షణాలలో భాగంగా దగ్గు, ముక్కు కారటం, జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం మొదలైనవి ఉంటాయి. HMPVకి నిర్దిష్ట టీకా లేదని యాంటీవైరల్ చికిత్స కూడా లేదని తెలిపారు.
చైనా ఎమర్జెన్సీ ప్రకటించిందన్న వాదనలు అవాస్తవం. చైనాలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా చైనా ప్రభుత్వం కానీ అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు.
Claim : చైనాలో శ్వాసకోశ వ్యాధులు పెరగడంతో, మరోసారి ‘ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు
Claimed By : Twitter users
Fact Check : False