ప్రవాస భారతీయుల సంఖ్య పరంగా కొన్ని కీలక దేశాలలో కెనడా ఒకటి. ఈ దేశం ఇటీవల భారత్‌తో వ్యవహరిస్తున్న తీరు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. భారతదేశం గానీ మరే దేశం గానీ రాయబారి స్ధాయి దౌత్యవేత్తను వెనక్కి రప్పించుకోవడం చాలా అరుదు. భారత్ ఇప్పుడు అటువంటి అరుదైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్ధితిని కెనడా సృష్టించింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ "ఏజెంట్" కారణమని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత, సెప్టెంబర్ 2023 నుండి భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు తీవ్రమైన నేర కార్యకలాపాలకు పాల్పడ్డారని కెనడా పోలీసులు కూడా ఆరోపించారు. భారత్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టింది.
అయితే వీటన్నిటి మధ్య, కెనరా బ్యాంక్ ముందు కొంతమంది వ్యక్తులు నిలబడి బీజేపీ పార్టీ జెండాలు పట్టుకుని ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు కెనడాతో ఉన్న వివాదం కారణంగా కెనరా బ్యాంక్ వెలుపల నిరసనలు చేస్తున్నారని పోస్టులు పెట్టిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు వైరల్ ఇమేజ్‌లో ఉన్న వ్యక్తులను అంధ్ భక్త్, సంఘీలు అంటూ విమర్శిస్తూ వచ్చారు. "కెనరా బ్యాంక్ ముందు కెనడాకు వ్యతిరేకంగా అంధ భక్తులు నిరసన తెలుపుతున్నారు" అనే వాదనతో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2020వ సంవత్సరం నాటి అసలు చిత్రాన్ని తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు.
జాగ్రత్తగా గమనించినప్పుడు, కెనరా బ్యాంక్ బిల్‌బోర్డ్ చిత్రంలోని ఇతర బోర్డుల కంటే స్పష్టంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము. షాప్ పేర్లు చాలా వరకు చిత్రంలో అస్పష్టంగా ఉన్నాయి.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని సెర్చ్ చేసినప్పుడు,
మలై మలర్ అనే తమిళ న్యూస్ పోర్టల్‌లో ప్రచురించిన వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము. ఈ వార్త ఆగస్టు 30, 2020న ప్రచురించారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో స్థానిక మునిసిపాలిటీ అధికారులపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన స్థలంలో పార్టీ జెండాను ఎగురవేసేందుకు జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సరస్వతి ఊటీ సిటీ సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ ఉద్యోగులు, పోలీసులు అధికారుల అనుమతి లేకుండానే జెండా స్తంభాన్ని తొలగించారు.
మున్సిపాలిటీ జెండా స్తంభాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ అనుచరులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ ఊటీ నగర అధ్యక్షుడు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారుల తీరును ఖండిస్తూ నిరసనలు చేశారు. వార్తా కథనంలో ఉంచిన చిత్రంలో కెనరా బ్యాంక్ బిల్‌బోర్డ్ లేదు. ఇక్కడ రెండు చిత్రాల మధ్య పోలికను చూడొచ్చు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2023లో విశ్వాస్ న్యూస్ కూడా డీబంక్ చేసింది. విశ్వాస్ న్యూస్ విభాగం ఊటీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోగన్ రాజ్‌ను సంప్రదించింది, ఈ చిత్రం 2020 నాటిదని, ఇటీవలిది కాదని ఆయన ధృవీకరించారు. ఆ ప్రాంతంలో కెనరా బ్యాంక్ బ్రాంచ్ లేదని, ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారని కూడా ధృవీకరించారు.
ఊటీ సిటీ వీధుల్లో నిరసన తెలుపుతున్న బీజేపీ పార్టీ సభ్యుల పాత చిత్రాన్ని డిజిటల్‌గా తప్పుడు వాదనలతో ఎడిట్ చేశారు. కెనరా బ్యాంకును కెనడాగా భావించి బీజేపీ నేతలు కెనరా బ్యాంకు ముందు నిరసనలు చేస్తున్నారనే వాదన అవాస్తవమని తేలింది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.