ఫ్యాక్ట్ చెక్: వైఎస్ విజయమ్మ వాహనానికి ఇటీవల ఎలాంటి ప్రమాదం జరగలేదు
గతంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన ఫోటోను ఇటీవలిదిగా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదం ఓ వైపు కొనసాగుతూ ఉంది. సరస్వతి పవర్ షేర్లను షర్మిల విక్రయించటంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల పైన పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ తాజాగా షర్మిలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసును డిసెంబర్ 13కి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు తన కుటుంబ ఆస్తులు పంచలేదని వైఎస్ విజయమ్మ ఇటీవల లెటర్ ను విడుదల చేశారు. ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబానికి చెందుతాయని, జగన్ రెడ్డి, షర్మిలకు ఎలాంటి వాటాలు పంచలేదని విజయమ్మ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి తమను విడిచిపెట్టిన 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు అంతా కలిసే ఉన్నామని, ఎలాంటి సమస్యలు లేవని వివరించారు. జగన్ తన వాటాను డివిడెండ్‌గా తీసుకుని తన సోదరికి 200 కోట్లు ఇచ్చారు. ఎంవోయూ ప్రకారం జగన్ కు 60 శాతం, షర్మిలకు 40 శాతం ఉండగా, ఎంవోయూకు ముందు ఆమెకు సమాన హక్కు ఉండడంతో సమానంగా పంచుకున్నారు. దీనికి అప్పుడూ ఇప్పుడూ నేనే సాక్షిని అని విజయమ్మ లెటర్ లో వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మకు చెందిన వాహనానికి యాక్సిడెంట్ జరిగిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"సొంత తల్లీ పైన కూడా కనికరం చూపించలేదు తెలుసా" అంటూ వైఎస్ విజయమ్మ వాహనానికి ప్రమాదం జరిగిందంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలోని వాహనానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం.
రెండు సంవత్సరాల కిందట ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను మేము గుర్తించాం. "వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం | YS Vijayamma Escapes Car Accident | hmtv" అనే టైటిల్ తో 11 ఆగస్టు 2022న hmtv లో కథనాన్ని గుర్తించాం.
సాక్షి న్యూస్ టీవీ ఛానల్ లో కూడా యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ ను టెలికాస్ట్ చేశారు. ఆగస్టు 11, 2024న ఈ ప్రమాదం జరిగిందని అందులో నివేదించారు.
సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం.
ఆగస్టు 11, 2022న సమయం న్యూస్ వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ ను కూడా మేము గమనించాం. " కర్నూలులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు.. తర్వాత వైఎస్ స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి.. కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి దగ్గర.. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. " అని కథనాన్ని మేము చూశాం. కాబట్టి, ఈ ఘటన ఇటీవల చోటు చేసుకున్నది కాదని మేము ధృవీకరించాం.
పలు తెలుగు మీడియా సంస్థలు కారు టైర్ పేలడం వలన ఈ ప్రమాదం జరిగిందని నివేదించాయి. అవి ఇక్కడ, ఇక్కడ మనం చూడొచ్చు.
ఇక ఇటీవలి కాలంలో విజయమ్మ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా మేము నిర్ధారించుకున్నాం. అయితే కొందరు అనవసరంగా వదంతులు వ్యాప్తి చేస్తున్నారని వైఎస్ విజయమ్మ నవంబర్ 5, 2024న వీడియోను రిలీజ్ చేశారు.
తమ కుటుంబం మీద అనవసరమైన వదంతులు వ్యాప్తి చేయొద్దంటూ విజయమ్మ చెప్పిన వీడియోను ఎన్టీవీ తో పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.
00:25 సెకండ్ల వద్ద కారు ప్రమాదం గురించి వైఎస్ విజయమ్మ మాట్లాడడం మనం చూడొచ్చు. రెండు సంవత్సరాల కిందట జరిగిన ప్రమాదాన్ని ఇటీవలిది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని వైఎస్ విజయమ్మ చెప్పుకొచ్చారు.
కాబట్టి, రెండేళ్ల కిందట జరిగిన ఘటనను ఇటీవల జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారని తేలింది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము ధృవీకరించాం.
Claim : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విజయమ్మ వాహనానికి ఇటీవల ప్రమాదం జరిగింది
Claimed By : Social Media Users
Fact Check : False