ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటనను మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో జరిగినదిగా ప్రచారం
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2024లో జరగనున్నాయి. మహారాష్ట్ర శాసనసభకు మొత్తం 288 స్థానాలకు ఓటింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 2024లో జరగనున్నాయి. మహారాష్ట్ర శాసనసభకు మొత్తం 288 స్థానాలకు ఓటింగ్ నవంబర్ 20, 2024న ఒకే దశలో నిర్వహించనున్నారు. నవంబర్ 23, 2024న ఓట్లను లెక్కించనున్నారు. పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం ప్రారంభించాయి. ఎలాగైనా గెలిపించుకోడానికి ఆయా నేతలు కసరత్తులు మొదలెట్టారు.
ఇలాంటి సందర్భంలో ఒక కాంప్లెక్స్‌లో ప్రజలు “జై శ్రీరాం” అని నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో మహారాష్ట్రలో చిత్రీకరించిన వీడియో అనే వాదనతో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. “*MOOD OF MAHARASHTRA* *महाराष्ट्र चुनाव का अत्यंत ही सुंदर ढंग से प्रचार प्रारंभ।*” అంటూ హిందీలో ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల మూడ్ ఇదేనని చెబుతున్నారు షేర్ చేస్తున్న వ్యక్తులు.
కొన్ని న్యూస్ ఛానల్స్ కు చెందిన యూట్యూబ్ పేజీలలో కూడా వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదిగా ఉంది. వీడియో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు సంబంధించింది. మహారాష్ట్రకు చెందినది కాదు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం గురించి ఇటీవల ప్రచురించిన ప్రముఖ మీడియా కధనలలో వైరల్ వీడియో ప్రస్తావన ఉందా అని వెతకగా, మాకు ఎటువంటి కధనాలూ లభించలేదు.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను సంగ్రహించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఫిబ్రవరి 15, 2022న “प्रभात फेरी , कानपुर पश्चिम “ అనే క్యాప్షన్‌తో ప్రచురించిన Facebook పోస్ట్‌ని కనుగొన్నాము
“अपार्टमेंट में मिला हिन्दू समाज का समर्थन प्रभात फेरी कानपुर पश्चिम #जय_श्रीराम” అంటూ మరో ఫేస్ బుక్ యూజర్ కూడా వీడియోను షేర్ చేశారు. వెస్ట్ కాన్పూర్‌లోని అపార్ట్‌మెంట్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు హిందూ భజనలు వినిపించాయని అందులో తెలిపారు.
‘प्रभात फेरी ‘ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ చేయగా.. 12 ఫిబ్రవరి, 2022న “మార్నింగ్_వాక్స్, డే 14” అనే శీర్షికతో ప్రచురించబడిన ఫేస్‌బుక్ పోస్ట్‌ని మేము కనుగొన్నాము. గౌతమ్ నగర్, కళ్యాణ్‌పూర్, రతన్ ఆర్బిట్ వంటి అపార్ట్‌మెంట్ల నివాసితుల నుండి ఇలా భారీ స్పందన వచ్చింది. కన్హా శ్యామ్ అపార్ట్‌మెంట్‌లు, డివినిటీ హోమ్ అపార్ట్‌మెంట్‌లు, గుల్‌మోహర్ అపార్ట్‌మెంట్‌లు, ఇంపీరియల్ హైట్ అపార్ట్‌మెంట్‌లు, ఇంద్ర నగర్ మొదలైన చోట్ల ప్రజలు ఎంతో భక్తితో భజనలు పడుతున్నారని తెలిపారు.
మేము కొన్ని అపార్ట్‌మెంట్‌ల చిత్రాల కోసం వెతకగా, డివినిటీ హోమ్స్ అపార్ట్‌మెంట్స్ అనే అపార్ట్‌మెంట్ చిత్రాలు మాకు కనిపించాయి. వైరల్ వీడియోలో కనిపించే అపార్ట్‌మెంట్‌తో పోలికను చూడగలిగే Google ఫోటోలను మేము కనుగొన్నాము.
మేము డివినిటీ హోంస్ వారి facebook పేజీలో ఉన్న వీడియోలు, ఫోటోలలో వైరల్ వీడియో లో ఉన్న పోలికలను కూడా తనిఖీ చేశాం. ఈ పేజీలో ఎన్నో వీడియోలు చూడొచ్చు. అందులో ఉన్న బిల్డింగ్ ను వైరల్ వీడియో లో ఉన్న బిల్డింగ్ తో పోల్చి చూడగా, రెండూ ఒకే స్థలాన్ని చూపుతున్నాయని తెలుస్తోంది. అక్కడ జరిగే ప్రత్యేక పండుగలు, పూజలూ ఈ పేజీలో అప్లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినది కాదని గుర్తించాం. యూపీలోని కాన్పూర్ కు సంబంధించిన పాత వీడియో ఇది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ప్రజలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది
Claimed By : Social media users
Fact Check : False