ఫ్యాక్ట్ చెక్: తమిళనాడులో ఆలయాన్ని మసీదుగా మార్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియోలో ఉన్నది ఓ దర్గా
వక్ఫ్ భూముల గురించి ఓ వైపు తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించారు. కొన్ని రాష్ట్రాలలో వక్ఫ్ బోర్డుపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు.
వక్ఫ్ బోర్డుతో భూవివాదాలకు రైతు ఆత్మహత్యకు సంబంధం ఉందంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కొన్ని కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లపై కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఆదార్ పోలీస్ స్టేషన్‌లో 174 సిఆర్‌పిసి కింద కేసు నమోదు చేసి తుది నివేదికను సమర్పించారు పోలీసులు.
ఈ పరిణామాల మధ్య ఓ ఆలయం లాంటి ప్రదేశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఆలయాన్ని మసీదుగా మార్చారంటూ పలువురు తమ సోషల్ మీడియా పోస్టుల్లో వాదిస్తున్నారు.
"హిందువుల్లారా ఇప్పటికైనా మొద్దు నిద్ర విడండి తమిళనాడు తెన్కాశిలో ఒక పురాతన హిందూ దేవాలయం ఇటీవల ప్రభుత్వ సహాయంతో మసీదుగా మార్చబడింది." అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు.
https://www.facebook.com/reel/
ట్విట్టర్ లో కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆలయాన్ని మసీదుగా మార్చలేదు. 17వ శతాబ్దం నుండి దర్గా అలానే ఉంది.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేశాం. అప్పుడు మాకు May 3, 2024 న Tathvam-asi అనే ట్విట్టర్ అకౌంట్ లో ఇదే వాదనతో పోస్టు పెట్టారని మేము గమనించాం.
ఈ ట్వీట్ కు తమిళనాడు ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫేక్ అంటూ సమాధానం ఇచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన వివరణలో " వీడియో నిజానికి పొట్టల్‌పుదూర్ లోని 'మొహైదీన్ అందవర్' దర్గాను చూపుతుంది, ఇది తిరునెల్వేలిలోని తెన్‌కాశీలో ఉన్న ఒక ప్రముఖ మతపరమైన ప్రదేశం. ఈ దర్గా దాని నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది, ఇది ద్రావిడ నిర్మాణ వారసత్వం నుండి ప్రేరణ పొందింది. ఈ దర్గాను 17వ శతాబ్దంలో (క్రీ.శ. 1674) 'మొహిదీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ' జ్ఞాపకార్థం నిర్మించారు. ఈ దర్గాను హిందువులు, క్రైస్తవులు పూజల కోసం విస్తృతంగా సందర్శిస్తారు. దర్గా వారసత్వ ద్రావిడ శిల్పకళకు గౌరవించి నిర్మించారు. పురాతన ఆలయాన్ని స్వాధీనం చేసుకుని మసీదుగా మార్చారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు" అంటూ వివరించారు.
మాకు తమిళనాడు టూరిజం వెబ్ సైట్ లో కూడా ఈ దర్గాకు సంబంధించిన వివరాలు లభించాయి.
https://www.tamilnadutourism.
పొట్టల్‌పుదూర్ దర్గా తమిళనాడులోని హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షాకు అంకితం చేసిన ఒక ప్రసిద్ధ ఇస్లామిక్ పుణ్యక్షేత్రమని అందులో తెలిపారు. ఇది భారతదేశంలోని సుఫీయిజం స్ఫూర్తికి నిదర్శనంగా మారింది. హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా ఓ గొప్ప సూఫీ సన్యాసి అని ప్రజలు నమ్ముతారు. యెమెన్ నుండి పొట్టల్‌పుదూర్‌కు వచ్చినట్లు చెబుతారు.
ఇదే వెబ్ సైట్ లో దర్గాను ఎప్పుడు నిర్మించారో కూడా వివరించారు.
పొట్టలపుదూర్ దర్గా చరిత్ర:
సూఫీ సాధువు హజ్రత్ సయ్యద్ మహమ్మద్ షా ఇరాన్ నుండి భారతదేశానికి ప్రయాణిస్తున్న సమయంలో, పొట్టల్‌పుదూర్ గ్రామానికి చేరుకుని, ప్రజలకు ఇస్లాం మతాన్ని బోధించాలని నిర్ణయించుకున్నారని నమ్ముతారు. ఆయన మరణం తరువాత, ప్రజలు 1674 సంవత్సరంలో ఒక సమాధిని ఏర్పాటు చేశారు. మసీదులోని సమాధిని ఇంకా పూజలు చేస్తూ వస్తున్నారని తెలిపారు.
దక్షిణాదిన పలు దర్గాలు ద్రావిడ వాస్తు విధానంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. అలా ఈ దర్గాను కూడా కట్టి ఉంటారని వాస్తు నిపుణులు తెలిపారు.
Pottalpudur Dargah - Tamilnadu అనే కీవర్డ్స్ ను ఉపయోగించి యూట్యూబ్ లో వీడియోల కోసం వెతికాం
"Thoppur dargah /thoppur /tappur/Tamil nadu ghat / dargah / kerla | Ror vlogs | Ror Vlogs" అనే టైటిల్ తో 5 సంవత్సరాల కిందట ROR VLOGS అనే యూట్యూబ్ వీడియోను చూశాం.
Sajid Pallithotungal యూట్యూబ్ ఛానల్ లో జనవరి 1, 2015న అప్లోడ్ చేసిన వీడియోను కూడా మేము చూశాం.
Tourism Bell యూట్యూబ్ ఛానల్ లో 11 సంవత్సరాల క్రితం దర్గా వీడియోను అప్లోడ్ చేశారు.
కాబట్టి, ఇటీవలి కాలంలో ఆలయాన్ని మసీదుగా మార్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : తమిళనాడులో ఓ ఆలయాన్ని మసీదుగా మార్చారు.
Claimed By : Social Media Users
Fact Check : False