త్రివిక్రమ్ డైరెక్షన్ లో మాస్ అండ్ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ హీరోగా పూజ హెగ్డే క్లాసీ హీరోయిన్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో ఉన్న అరవింద సమేత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా ప్రమోషన్స్ ని చకచకా కానిచ్చేసి సినిమాని థియేటర్స్ లో దింపేందుకు చిత్ర బృందం శతవిధాలా కష్టపడుతుంది. ప్రస్తుతం ఇటలీ సాంగ్ షూట్ పూర్తి చేసుకుని అరవింద బృందం త్వరలోనే హైదరాబాద్ కి రానుంది.
ఫ్యాక్షన్ నేతలుగా...
అయితే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ బాబు, జగపతి బాబు ఫ్యాక్షన్ లీడర్స్ గా నటిస్తున్నారు. ఊరి కోసం కుటుంబాన్ని లెక్కచేయని గ్రామ పెద్దగా నాగ బాబు ఈ సినిమాలో కనిపిస్తుండగా.. తనేం అనుకున్నాడో అదే కావాలని పట్టుబట్టే క్రూరత్వం ఉన్న వాడిగా జగపతి బాబు ఈ సినిమాలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అని.. అందులోనూ ఈ సినిమాలో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని లేటెస్ట్ న్యూస్.
ఎన్నికల సీన్లు హైలైట్ అంట...
ఆ ఎన్నికల ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తో ముడిపడిన స్థానిక ఎన్నికలకి సంబంధించిన సీన్ ఉంటుందని... ఆ ఎన్నికల సన్నివేశాలను త్రివిక్రమ్ విజిల్స్ పడేలా చిత్రీకరించాడని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం అరవింద సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా... ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని ఒక రేంజ్ లో చెయ్యాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.