తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో యూరప్ ఖండంలో తొలి శతావధానం
యూరప్ ఖండంలో జరిగిన తొలి శతావధానం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో త్రిభాషా మహాసహస్రావధాని, ఏలూరు శ్రీ ప్రణవ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 20వ శతావధానం 2024 జూలై 13వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా లండన్ నగరంలో జరిగింది. ఇది యూరప్ ఖండంలో జరిగిన తొలి శతావధానం. ప్రముఖ తెలుగు సాహితీ సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఈ శతావధానాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 ఆశువులు, అప్రస్తుత ప్రసంగంతో శతావధానం ఆద్యంతం హృద్యంగా సాగింది. మొత్తం శతావధానం ఒకేరోజులో కేవలం 5 గం.ల 30 నిల.లో పూర్తిచేయడం తెలుగు సాహితీ చరిత్రలో, ముఖ్యంగా విదేశంలో నెలకొల్పిన రికార్డుగా తాల్ సంస్థ అభివర్ణించింది. ప్రాశ్నికులు సంధించిన ప్రశ్నలకు శరవేగంగా పద్యాలు అవధానిగారు పూరిస్తుంటే ఆ వేగము లేఖకుల కలాలకు అందలేదు. సమస్య, దత్తపది, వర్ణన అంశాలను కూడా ఆశువుగా కొత్త కొత్త తెలుగు పదాలతో అవధానిగారు పూరిస్తూ వుంటే, ప్రత్యక్ష పరోక్ష వీక్షకులను ప్రతి పద్యం ఆణిముత్యంలా, ఒక సాహితీబోధలా, మధురమైన తెలుగు సాహితీ విందులా అలరించింది. వయసు తారతమ్యం లేకుండా సీనియర్ సిటిజెన్లతో పాటు విద్యార్థినీ విద్యార్థులు సభకు హాజరై వెల్లివిరిసిన తెలుగు వెలుగులను ఆస్వాదించారు. లండన్ లో తెలుగు భాషావ్యాప్తికై చక్కటి కృషి చేస్తున్న తాల్ సంస్థ ఈ కార్యక్రమం తమ ద్వారా నిర్వహించడం, "అవధాన మురారి" అనే బిరుదుతో శ్రీ పద్మాకర్ గారిని సముచితంగా సత్కరించుకోవడం తమకు దక్కిన అరుదైన అపురూప అవకాశంగా భావిస్తున్నామన్నారు.