లక్షద్వీప్‌ కు ఎలా వెళ్లాలంటే?

కోచి నుంచి లక్షద్వీప్‌కు పలు సమయాల్లో 7 నౌకలు అందుబాటులో ఉన్నాయి

Update: 2024-01-11 03:16 GMT

how to reach lakshadweep from telugu states and kochi

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ కు వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్‌ చేరుకోవచ్చు.

అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ అనేది 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి ‘లక్షద్వీప్’ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ‘లక్కదివ్’ అని పిలిచేవారు. లక్షద్వీప్ చేరుకునేందుకు రెండు రకాల మార్గాలున్నాయి. వాటిలో ఒకటి సముద్ర ప్రయాణం కాగా.. రెండోది విమాన ప్రయాణం. కేరళలోని ‘కొచ్చి’ని లక్షద్వీప్‌కు ‘గేట్‌ వే’గా పేర్కొంటారు. కోచి నుంచి సముద్ర మార్గంలో నౌక ద్వారా లక్షద్వీప్ వెళ్లాలంటే 14 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కోచి నుంచి లక్షద్వీప్‌కు పలు సమయాల్లో 7 నౌకలు అందుబాటులో ఉన్నాయి. ఈ నౌకలు కొచ్చి, లక్షద్వీప్‌ల మధ్య పర్యాటకులను తరలిస్తుంటాయి. ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాత చిన్న పడవల్లో బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొచ్చి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ నుంచి విమానం ద్వారా అగట్టి, బంగారం దీవులను చేరుకోవచ్చు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోచి నుంచి లక్షద్వీప్‌కు విమాన సర్వీసులు నడుపుతోంది. లక్షద్వీప్‌లోని అగట్టి ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అగట్టి నుంచి కవరత్తి, కద్మత్‌ లాంటి పర్యాటక ప్రాంతాలకు పడవల్లో వెళ్లవచ్చు.
లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి గంటన్నర సమయం పడుతుంది. కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటే కనీస ధర రూ. 5,500 ఉంటుంది.కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు ఏడు ఓడలు అందుబాటులో ఉన్నాయి. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ, ఎంవీ లాగూన్, ఎంవీ కోరల్స్, ఎంవీ అమిందివి, ఎంవీ మినీ కాయ్ అనే ఓడలు ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుంటాయి. మనం వెళ్లాల్సిన దీవుల ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం 14 నుంచి 18 గంటలు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ (రెండు బెర్తులు), సెకండ్ క్లాస్ ఏసీ (నాలుగు బెర్తులు) అనే కేటగిరీలు ఉంటాయి. ఓడలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఓడను బట్టి క్లాస్‌ల ఆధారంగా టిక్కెట్ ధరలు రూ. 2,200 నుంచి గరిష్ఠంగా రూ. 6 వేల వరకు ఉంటాయి.
లక్షద్వీప్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ‘లకాదీవ్, మినీ కాయ్, అమిందివి ఐలాండ్స్ నిబంధనలు-1967’ ప్రకారం.. లక్షద్వీప్‌ స్థానికులు కాని వారంతా అక్కడికి వెళ్లడానికి, ఉండటానికి తప్పనిసరిగా అక్కడి అధికారుల అనుమతి తీసుకోవాలి. కేవలం ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అనుమతి నిరాకరణ, మంజూరు, పునరుద్ధరణ, ఇతర అంశాల్లో సహాయం కోసం కూడా కొన్ని మార్గదర్శకాలు, నియమ నిబంధనల్ని రూపొందించారు.
ఎంట్రీ పర్మిట్ 
అనే పోర్టల్ అందుబాటులో ఉంది.
లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64 వేలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభాలో 96 శాతం ముస్లింలు ఉన్నారు. అక్ష్యరాస్యత 91 శాతం. లక్షద్వీప్‌లో 10 జనావాస ప్రాంతాలు ఉన్నాయి. వీటి పేర్లు కవరత్తి, అగత్తి, అమిని, కద్మత్, కిల్టాన్, చెట్లత్, బిత్రా, ఆందోహ్, కల్పేనీ, మినికాయ్‌. బిత్రాలో 271 మంది మాత్రమే నివసిస్తున్నారు. బంగారం ద్వీపంలో 61 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ మలయాళం మాట్లాడతారు. మినీకాయ్‌లో ప్రజలు మహే మాట్లాడతారు. లక్షద్వీప్‌లో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ కంపెనీలు టెలీ కమ్యూనికేషన్ సేవల్ని అందిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ అన్ని జనావాస ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ సేవలు కవరత్తి, అగత్తి అనే రెండు ప్రాంతాల్లోనే లభిస్తాయి. లక్షద్వీప్‌లోని ప్రజలకు చేపలు పట్టడం, కొబ్బరి సాగు ముఖ్యమైన ఆదాయ వనరులు. లక్షద్వీప్‌లో పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత సంవత్సరం లక్షద్వీప్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య దాదాపు 25 వేలు అని కొన్ని మీడియా రిపోర్టులు తెలిపాయి. లక్షద్వీప్‌లో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.


Tags:    

Similar News