భర్తగా వంద మార్కులు వేయలేను - రేణు దేశాయ్

Update: 2017-11-27 08:28 GMT

నూటికి నూరుశాతం ఎవరైనా పరిణతి కలిగి ఉంటారా? అది సాధ్యమేనా? అలా ఉంటే దేవుడవుతారు తప్పితే మనిషి కారు. తమ హీరో గురించి అభిమానులు ఎన్నైనా ఊహించుకోవచ్చు. లార్జర్ దేన్ లైఫ్ సైజులో చిత్రీకరించుకోవచ్చు. కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. ఒక మహిళ చెల్లిగా, భార్యగా, తల్లిగా ఎలా బహుముఖ పాత్రలు పోషిస్తుందో అదే తరహాలో మగాడూ భిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది. వామపక్ష భావజాలంతో ప్రభావితుడైన పవన్ కల్యాణ్ వందశాతం మార్కులు కొట్టేస్తాడా? అతనితో పన్నెండేళ్లు కాపురం చేసి విడిపోయిన రేణు దేశాయ్ అంచనా ఏమిటి? సాధారణంగా భార్యాభర్తలు రోజుకు పది పన్నెండు గంటలు మాత్రమే కలిసి ఉంటారు. అందులోనూ నిద్ర సమయం తీసేస్తే మిగిలేది చాలా స్వల్పం. కానీ వర్కింగు పార్టనర్లుగా,కొలీగ్స్ గా కూడా జీవితాన్ని పంచుకున్న రేణు, పవన్ లు ఇతర దంపతుల కంటే కలిసి గడిపిన కాలం చాలా ఎక్కువ. అందువల్ల సెట్స్ లోనే కాదు, సెల్ప్ జీవితంలోనూ అతని ప్రతి అణువూ ఆమెకు ఎరుకే. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పవన్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు రేణు ప్రయత్నించారు. అదే సమయంలో అతనికి దూరం కావడానికి గల కారణాలనూ స్పృశించారు.

నిరంతర చింతన

సినిమా రంగంలో ఉన్నప్పటికీ అతను పూర్తిగా సినిమా మనిషి కాడు. డబ్బు, సెలబ్రిటీ స్టేటస్ వంటివి వెన్నాడుతున్నా వాటిని సాధ్యమైనంత వరకూ తప్పించుకునేందుకే ప్రయత్నించేవాడు. కనీసం సినిమా ప్రమోషన్లను కూడా పట్టించుకునేవాడు కాదు. ఏదో చేయాలనే తపనతో రగిలిపోయేవాడు. అదేమిటన్న విషయంలో మాత్రం కొంత క్లారిటీ మిస్సయ్యేది. ఆర్థికంగా నిలదొక్కుకోవడమన్న ధ్యాసే అతనికి ఉండేది కాదు. హఠాత్తుగా పదిహేను రోజులపాటు ఫామ్ హౌస్ కి వెళ్లిపోయి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పోయేవాడు. అప్పుడు సినిమాలు, ఇతర వ్యాపకాలు పట్టేవి కావు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఒక నటుడు ..కూలి డబ్బులకుసైతం గిట్టుబాటు కానీ సేద్యంపై మక్కువ చూపడం విచిత్రమే. అయితే అతనిలోని ఈ వైవిధ్యమే నాకు నచ్చడంతో పెద్దగా ఆందోళన కలిగేది కాదు అంటోంది రేణు దేశాయ్. నటుడిగా తన స్థాయికి తగిన పారితోషికం తీసుకునేవారు. దానిని తనకు నచ్చిన రీతిలో వెచ్చించేవారు. అవసరమైన వాళ్లకు సాయం అందించేవారు. ఒక రకంగా చూస్తే అభిమానులు కేవలం నటనను చూసి డెమీ గాడ్ గా భావిస్తారు. కానీ అతనికి సన్నిహితంగా ఉంటూ అతని ఆదరణ పొందినవారు ఆత్మీయ మిత్రునిగా ప్రేమిస్తారు అంటారు రేణు. మరెందుకు విడిపోయారంటే మాత్రం అదో పెద్ద కథ అంటారు.

నా వరకూ అరవై మార్కులే...ప్రేమ, పెళ్లి, అన్నేళ్ల కాపురం తర్వాత కూడా అతనిలో నావరకూ పెద్దగా వ్యక్తిత్వ లోపాలు కనిపించ లేదు. కానీ ప్రయారిటీల విషయంలో ఇద్దరిదీ భిన్నమైన ధోరణి. ఒక మహిళగా, తల్లిగా నాకు అత్యంత గౌరవం ఇచ్చేవారు. భార్య విషయానికొచ్చేసరికి కొంత గ్యాప్ ఉంటుండేది. అది నా సలహాలు తీసుకోవడం ఇష్టపడకో, లేక తన మార్గం మార్చుకోవడం ఇచ్చగించకో అర్థమయ్యేది కాదు. అయితే విడిపోయే చివరిక్షణంలో కూడా తల్లిగా పిల్లలకు నేను బాద్యత తీసుకొంటేనే సక్రమంగా న్యాయం చేయగలనని ఆయన నమ్మారు. అందుకే అకిరా, ఆద్య నా వెంట ఉన్నారు. ఈ విషయంలో కూడా తండ్రిగా అతనికి మంచి మార్కులే వేస్తాను. భార్యగా మాత్రం అరవై మార్కులే ఉంటాయి. అదయినా ఫస్టు క్లాసే కదా..అంటుంది రేణు దేశాయ్. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలకు వ్యక్తిత్వ లోపాలకంటే వైయక్తిక వైరుద్ధ్యాలే కారణమని ఆమె మాటలను బట్టి తేటతెల్లమవుతోంది.మోర్ పొసెసివ్, డిమాండింగ్ గా ఉండే రేణు, ప్రతి విషయంపైనా వైరాగ్యంతో ప్రవర్తించే పవన్ ల మధ్య అసలు పదేళ్లకు పైగా బంధం కొనసాగడమే గొప్ప విషయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గాఢమైన ప్రేమానుబందం ఉండటంతో చాలాకాలం వీరురువురి వ్యక్తిత్వ వైరుద్ధ్యాలు వైవాహికబంధాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. కానీ అవసరాలు పెరిగేకొద్దీ అనుబంధపు పొర పలచన కావడంతో అంతరం పెరిగి విడాకులకు దారితీసిందనేది రేణు ఇంటర్వ్యూల సారాంశం.

Similar News