Pneumonia- తెలంగాణను భయపెడుతున్న న్యుమోనియా
తెలంగాణ లో న్యుమోనియా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్
తెలంగాణ లో న్యుమోనియా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల ఆసుపత్రులు న్యుమోనియా రోగులతో నిండిపోయాయి. డెంగ్యూ రోగుల సంఖ్య తగ్గిపోగా.. న్యుమోనియా ఉగ్రరూపం దాల్చుతోంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పొగతాగేవారు, మద్యం తాగేవారు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు న్యుమోనియాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. న్యుమోనియా బారినపడేవారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచి నేటి వరకు ప్రతీరోజూ సుమారు 1000 మంది రోగులు న్యుమోనియా ,ఇన్ఫ్లుఎంజా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు చేరుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటి కేసులు అధికంగా వస్తున్నాయని వైద్యులు తెలిపారు. న్యుమోనియా వ్యాధితో బాధపడే రోగులకు తప్పనిసరిగా ఆక్సిజన్ అవసరం ఉండడంతో నగరంలో అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న వారిలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని నిలోఫార్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సగటున 30 -32 న్యుమోనియా కేసులు, 20-25 ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి.