సరైన నిద్రలేకుంటే ఏమవుతుంది.. లండన్ పరిశోధనలో షాకింగ్ నిజాలు
ఈ రోజుల్లో చాలా మందిలో నిద్ర కరువైపోయింది. రకరకాల సమస్యల కారణంగా నిద్రలేమి సమస్యతు కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మందిలో నిద్ర కరువైపోయింది. రకరకాల సమస్యల కారణంగా నిద్రలేమి సమస్యతు కొట్టుమిట్టాడుతున్నారు. శరవేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.
8 ఎనిమిది గంటల నిద్ర
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలు నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి వివిధ రకాల వ్యాధులు ఎలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.
ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర అంటే ఏమిటి ?
6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా తెలిపారు. లండన్‌లో నిర్వహించిన పరిశోధనలలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిద్రలేమి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటంది
నిద్రలేమి సమస్య శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. నిద్రలేమిపై అనేక పరిశోధనలు చేశారు పరిశోధకులు. ఇటీవల నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని గుర్తించారు పరిశోధకులు. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని, అంతేకాకుండా తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్ షేన్ ఓమారా పేర్కొన్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.