Train : సమ్మర్ హాలిడేస్.. రైళ్లన్నీ ఫుల్లు అయిపోయాయే
సమ్మర్ హాలిడేస్ లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రైళ్లలో సీట్లన్నీ ముందుగానే బుక్ అయ్యాయి
సమ్మర్ హాలిడేస్ లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు సమ్మర్ లోనే ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. అందుకే సమ్మర్ హాలిడేస్ లో ట్రైన్ టిక్కెట్లు దొరకడం కష్టం. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి వేసవి సెలవులు రానున్నాయి. తిరిగి బడులు తెరుచుకునేది జూన్ నెలలోనే. అందుకే సమ్మర్ లో ట్రిప్ లకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే తాము వెళ్లాల్సిన ప్రదేశాలకు టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.
వెయిటింగ్ లిస్ట్ కూడా...
అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులో ఉండటంతో రైళ్లలో సీట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి అన్ని రైళ్లలో ఇదే పరిస్థితి. ముఖ్యంగా షిర్డీ, తిరుపతి, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు తోడు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లే అన్ని రైళ్లలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ప్రయాణం రద్దయితే కొంత సొమ్ము కట్ అయినా ఇబ్బంది లేదని భావించి, ప్రయాణంలో ఇబ్బందులు పడకూడదని ఆశించి ముందుగానే బుక్ చేసుకోవడంతో రైళ్లలో టిక్కెట్లన్నీ అడ్వాన్స్ గానే బుక్ అయ్యాయి. బెర్త్ దొరకడం కష్టంగా మారింది. ఇప్పటికే ప్రధానమైన రైళ్లలో వెయిటింగ్ లిస్గ్ చాంతాడంత కనిపిస్తుంది.