Hyderabad: ఆ ఫ్లై ఓవర్లన్నీ క్లోజ్.. చూసుకోండి మరి!!

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు

Update: 2023-12-30 12:09 GMT

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు. PVNR ఎక్స్ప్రెస్ వే రాత్రి10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్).. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయనున్నారు.

ప్రజా రవాణాకు సంబంధించి కూడా పలు సూచనలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. క్యాబ్, ఆటోరిక్షా డ్రైవర్లను కూడా నిశితంగా పర్యవేక్షిస్తారు. డిమాండ్‌పై ప్రయాణీకులకు సేవలను అందించడానికి నిరాకరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్లు సరైన యూనిఫాంలో ఉండాలని.. అన్ని పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు ఇ-చలాన్ జరిమానాను ఎదుర్కొంటారు. ప్రజలకు సమస్యలు ఎదురైతే 9490617346కు వాట్సాప్‌లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోనూ రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన. ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని చెప్పారు పోలీసులు.
మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడానికి బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం మత్తులో ఉన్న వినియోగదారులను వాహనాలను నడపడానికి అనుమతించే సంస్థలపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. సైబరాబాద్‌ వ్యాప్తంగా రాత్రంతా బ్రీత్‌ ఎనలైజర్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులు వారి లైసెన్సులను జప్తు చేసి సస్పెన్షన్ కోసం రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి పంపనున్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Tags:    

Similar News