Hyderabad : మరో రెండు గంటలపాటు భారీ వర్షం.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి;
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో అనేక చోట్ల విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు గంటల పాటు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉండటంతో నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఐకియా జంక్షన్ తో పాటు గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ట్రాఫిక్ సమస్య కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. అరగంటలోనే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం...
గురువారం కావడంతో విధుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణం చేసే సమయంలో వర్షం కురవడంతో వాహనాలు పెద్దయెత్తున నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 9 లో వర్షం ధాటికి నాలా కొట్టుకుపోవడంతో రోడ్డు మీదకు వరద నీరు ప్రవాహం చేరుతుండంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మ్యాన్‌హోల్స్ ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెరిచి నీటిని లోపలకి పంపుతున్నారు. ఎవరూ పౌరులు జీహెచ్‌ఎంసీకి తెలియకుండా మ్యాన్‌హోల్స్ తెరవవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.