Hyderabad : దిగువన హైదరాబాద్ "రియల్" రంగం.. పల్లె బాట పడుతున్న జనం
హైదరాబాద్ లో గత కొంత కాలంగా ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు నిలిచిపోయాయి.రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది
హైదరాబాద్ లో గత కొంత కాలంగా ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్న వార్తలు పలు అధ్యయనాల్లో తేలుతుంది. అనేక సర్వే సంస్థలు కూడా దీనిని నిజమని చెబుతున్నాయి. భూముల ధరలు కూడా గతంలో కంటే తగ్గాయంటున్నారు. కేవలం భూములు మాత్రమే కాదు అపార్ట్ మెంట్ల ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే లక్షలాది ఫ్లాట్లు నిర్మాణం చేసి కొనుగోలుకు నోచుకోకుండా మిగిలిపోయాయి. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఒక కారణమయితే.. మరొక వైపు ప్రజలు గ్రామీణ వాతావరణాన్ని కోరుకుంటుండటం కూడా మరొక కారణమని చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే...
హైదరాబాద్ లో గత ఏడాది తో పోలిస్తే గృహ విక్రయాలు ఐదు శాతం పడిపోయినట్లు అనరాక్ అనే సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదిలో హైదరాబాద్ లో కేవలం 58000 యూనిట్లు మాత్రమే విక్రయం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రోనగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఇళ్ల విక్రయాలు తగ్గాయన్నది చెబుతూ నివేదికలను వెల్లడించింది. అయితే అదే సమయంలో కేవలం ప్రభుత్వం పరంగా మాత్రమే కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం కూడా అమ్మకాలు పెరగపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. గతంలో పల్లెల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్, కాలుష్యం ప్రభావంతో నగరం నుంచి పల్లెబాట పట్టే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది.
గ్రామీణ వాతావరణం కోసం...
హైదరాబాద్ నగరం పదుల కిలోమీటర్లు విస్తరించింది. భూములు కూడా సరైన చోట సమయంలో అందుబాటులో లేవు. దీంతో నగర శివారుల్లో ఎక్కువ నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే ఇళ్లలోకి చేరుకునే వారికి నగర శివారులో నిర్మించిన ఇళ్ల పట్ల ప్రజలు పెద్దగా మొగ్గు చూపడం లేదు. దూరప్రాంతం నుంచి సిటీలోకి రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. మరికొందరు పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ నగరం కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం మంచిదన్న ఆలోచనకు వచ్చారు. గాలి వెలుతురుతో పాటు ఖర్చులు కూడా రూరల్ ఏరియాలో తగ్గుతాయని భావించి ఎక్కువ మంది పల్లె బాట పడుతున్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారని వివిధ సంస్థలు చేసిన సర్వేల్లోనూ స్పష్టమయింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now