నిఘా నీడలో తాజ్‌కృష్ణ హోటల్
తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్భంగా విమోచన దినోత్సవం సందడి నెలకొంది. రాజకీయ నేతల ర్యాలీలు, సభల ఏర్పాటుతో..
తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్భంగా విమోచన దినోత్సవం సందడి నెలకొంది. రాజకీయ నేతల ర్యాలీలు, సభల ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇక భాగ్యనగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి వాతావరణం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదారాబాద్‌కు తరలివస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత శంషాబాద్‌లో విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజ్‌కృష్ణ హోటల్ కేంద్రంగా జరగనున్న ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక నిఘా పెట్టారు.
ఈ సమావేశాలు జరిగుతున్న తాజ్ కృష్ణ హోటల్‌తో సహా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం నుంచే కొంతమంది ప్రముఖులు రావడంతో.. అటు శంషాబాద్ విమానాశ్రయంతో సహా తాజ్ కృష్ణ హోటల్ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు.
కాగా, మరోవైపు శాంతిభద్రతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే తాజ్ హోటల్‌లోని బస చేసి ఉన్న వారి జాబితాలను పోలీసులు సేకరించారు. తాజ్‌హోటల్‌కు వచ్చిపోయే వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణ హోటల్‌తో సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో కేవలం అధీకృత వ్యక్తులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ప్రతిరోజూ.. మూడు నాలుగు సార్లు బాంబు స్క్వాడ్ బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీలు చేయనున్నారు. ఇద్దరు డీసీపీ అధికారుల నేతృత్వంలో మరో ఇద్దరు అదనపు డీసీపీలు, 4గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్‌స్పెక్టర్లు, పదమూడు మంది ఎస్సైలు, 110 మంది ప్లటూన్ల సాయుధ బలగాలు ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.
అంతేకాదు వీళ్లలో మహిళా అధికారులు, సిబ్బంది కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా తాజ్ కృష్ణ హోటల్ వద్ద భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శని, ఆదివారాల్లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.