Cold Winds : బయటకు రావద్దు.. చలితో రోగాలు కొని తెచ్చుకోవద్దు

తెలంగాణలో చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2024-12-19 03:52 GMT

తెలంగాణలో చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలులు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం పది గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. సాధారణకంటే చలి తీవ్రత మూడు డిగ్రీలు తక్కువగా నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సింగిల్ డిజిట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. చలిగాలులతో పాటు పొగమంచు కూడా పూర్తిగా కమ్మేయడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బంది పడిపోతున్నారు.


గతంలో ఎన్నడూ లేని విధంగా...

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. పదిహేను జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు చలిమంటలతో కాచుకుంటూ కొంత వెచ్చదనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట ఆరు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గిరిజనులు రోజువారీ పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలన్నా చలిపులికి భయపడి జంకుతున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
5.9 డిగ్రీల కనిష్టంగా...
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్ నగరంలో 11.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనసంచారం రోడ్లపై కనిపించడం లేదు. పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, మరో పదిహేడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకులో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు చెబుతున్నారు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో వర్షాల వల్ల చలి తీవ్రత రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News