ఏపీలో థియేటర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. జీవో నంబర్ 35 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లను విక్రయించలేక.. థియేటర్ ను నష్టాల్లో నడపడం ఇష్టం లేక చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడగా.. మరికొన్నింటిని అధికారులు దాడులు చేసి.. సరైన సదుపాయాలు, కోవిడ్ ప్రికాషన్స్ పాటించడం లేదన్న కారణాలు చూపించి సీజ్ చేశారు. ఇప్పటి వరకూ ఏపీ వ్యాప్తంగా 175 థియేటర్లు మూతపడ్డాయి. దీంతో.. అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాల ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడింది. అఖండ, పుష్ప సినిమాలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా.. శ్యామ్ సింగరాయ్ కు థియేటర్ల మూసివేతతో కష్టాలు తప్పేలా లేవు. ఏ ఒక్క జిల్లాలోను శ్యామ్ సింగరాయ్ కోటిరూపాయల కలెక్షన్ రాబట్టలేకపోయింది.
ఇదిలా ఉండగా.. ఏపీకి చెందిన ఎగ్జిబిటర్లంతా సమావేశమయ్యారు. ప్రభుత్వం తమపై కఠినంగా వ్యవహరిస్తే.. నిరసన వ్యక్తం చేసేందుకు పిలుపునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు థియేటర్లపై జరిగిన దాడులతో ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు మాత్రం.. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి తట్టుకోలేక సినిమాల ప్రదర్శనను కొనసాగించినా.. తమకేమీ లాభం చేకూరడం లేదని వాపోతున్నారు. కాగా.. ఏపీలో సినిమా థియేటర్ల పరిస్థితిపై తెలుగు సినీ ప్రముఖులు ఉమ్మడివేదికపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై సీఎం తో చర్చిస్తున్నారని సమాచారం. చిరంజీవి జోక్యంతోనై థియేటర్లలో రేట్లపై ప్రభుత్వం దిగివస్తుందేమో చూడాలి.