RRR పై బ్రెజిల్ ప్రెసిడెంట్ పొగడ్తల వర్షం..
RRR చిత్రానికి అవార్డులు, రివార్డులు మాత్రమే కాదు విదేశీ ప్రముఖులు నుంచి కూడా ప్రశంసలు అందుతున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) లతో తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ 'RRR' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకొని రికార్డులు సృష్టించింది. కేవలం అవార్డులు మాత్రమే కాదు, విదేశీ ప్రముఖులు నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
తాజాగా ఈ చిత్రం పై బ్రెజిల్ ప్రెసిడెంట్ 'లులా డ సిల్వా' పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం భారతదేశం వేదికగా జరుగుతున్న G20 సమ్మిట్ లో పాల్గొనేందుకు భారత్ కి వచ్చిన అధ్యక్షుడు లులాని.. భారతీయ సినిమాలు ఏమన్నా చూస్తారా..? అని ప్రశ్నించగా, నిమిషం కూడా ఆలోచించకుండా.. ఆర్ఆర్ఆర్ అంటూ టక్కున సమాధానం ఇచ్చేశారు. "మూవీలోని డ్రామా, డాన్స్, ఆర్టిస్ట్ ల యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్.. ఇలా ప్రతి ఒక్కటి ఎంతో నచ్చింది. దర్శకుడికి, నటీనటులకు నా అభినందనలు" అని తెలియజేశారు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా రాజమౌళి రియాక్ట్ అయ్యాడు. "మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించడం, మా చిత్రం RRR ని ఆస్వాదించాం అని చెప్పడం మా టీం మొత్తానికీ ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. మీ హృదయపూర్వ మాటలకు చాలా కృతజ్ఞతలు. మా దేశంలో మీరు గొప్ప టైంని గడుపుతున్నారని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ట్వీట్స్ పై నెటిజెన్స్ రెస్పాండ్ అవుతూ.. భారతీయ సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తీసుకు వచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తోనే ఇంతటి గుర్తింపు వచ్చిందంటే.. తరువాత రాబోయే మహేష్ సినిమాతో ఇంకెంతటి ఫేమ్ ని తీసుకు వస్తాడో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.