అబ్దుల్ కలామ్‌తో ఓపెనింగ్.. సహానటులు నుంచి ఆరోపణలు.. చిరంజీవి@25
అబ్దుల్ కలామ్, నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న చిరంజీవి తన సహనటులు నుంచి మాత్రం ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ప్రయాణాన్ని ఒక ఉదాహరణగా మార్చి ఎంతోమందికి ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యాడు. ఆడియన్స్ లోనే కాదు తోటి కళాకారుల్లో కూడా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే చిరంజీవి అంటే డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ మాత్రమే కాదు. సేవ కార్యక్రమాలు, ఆదరించే అభిమానులను ఆదుకునే ఆపద్బాంధవుడు అని కూడా గుర్తుకు వస్తుంది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ అంటూ ప్రజాసేవకు పూనుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు.
అయితే ఈ సేవా ప్రయాణం ఎప్పుడు మొదలైంది. ఈ జర్నీలో చిరంజీవి అందుకున్న ప్రశంసలు ఏంటి..? ఎదురుకున్న ఆరోపణలు ఏంటి..? చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు మొదలైందంటే.. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి సమయానికి చికిత్స అందుతుంది. కానీ ఒక్కప్పుడు అలా ఉండేది కాదు. సమయానికి రక్తం అందుబాటులో లేక ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. ఇక అలాంటి సంఘటనలు చూసిన చిరంజీవి.. ఏదోకటి చేయాలని భావించాడు.
ఈక్రమంలోనే అభిమానులు తన పై చూపించే ప్రేమని ప్రజల ప్రయోజనాలు కోసం ఉపయోగించాలి అని అనుకున్నాడు. అలా అభిమానులకు ఒక పిలుపుని ఇచ్చి 1998 అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్'ని ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్టార్ట్ చేశాడు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికీ ఉచితంగా అందజేశాడు. అలాగే ఐ బ్యాంక్ ద్వారా 10 వేల మంది ప్రజలకు తను కంటి చూపు అయ్యాడు. ఇటీవల కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేసి ప్రజలకు కొత్త ఊపిరిని పోశాడు.
అయితే ఈ జర్నీలో చిరంజీవి ప్రశంసలు, విమర్శలు అందుకున్నాడు. 1998 తరువాత 2006లో హైదరాబాద్ జూబిలీహిల్స్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ క్యాంపుని ఓపెన్ చేశారు. ఈ ప్రారంభోత్సవం అప్పటి భారత ప్రెసిడెంట్ ఏ పి జె అబ్దుల్ కలామ్ చేతులు మీదుగా జరిగింది. 'చిరంజీవి ట్రస్ట్ ప్రజల్లో నుంచి బాధని తీసేస్తుంది' అంటూ అబ్దుల్ కలామ్ ప్రశంసించారు. కలామ్ మాత్రమే కాదు నరేంద్ర మోదీతో పాటు మరెంతో మంది చిరంజీవిని ప్రశంసించిన వారే.
ఇక ఈ ఓపెనింగ్ జరిగిన 5 ఏళ్ళకు 2011లో చిరంజీవి సహా నటులు రాజశేఖర్, జీవిత.. ట్రస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని అమ్ముకుంటోందని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పటిలో వివాదాస్పదం అయ్యి ప్రభుత్వం సోదాలను కూడా ఎదురుకుంది ట్రస్ట్. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలని, వాటికీ ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు.. రాజశేఖర్, జీవితకి పరువు నష్టం కేసు కింద జైలు శిక్ష కూడా విధించింది.
కాగా చిరంజీవి ఈ సేవా ప్రయాణం మొదలుపెట్టి నేటితో (అక్టోబర్ 2) 25 ఏళ్ళు పూర్తి అవుతుంది. దీంతో చిరంజీవి ఈ జర్నీ గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ వేశాడు. ఈ సేవాకార్యక్రమంలో తన వెంట నడుస్తూ వస్తున్న వారికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. దేశం కోసం చేసే ఈ చిన్న సాయం గాంధీజీకి తను ఇచ్చే నివాళి అంటూ పేర్కొన్నాడు.