ఆ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో చిరు 'ఖైదీ'.. అప్పటి విశేషాలు..

40 ఏళ్ళు పూర్తి చేసుకున్న చిరంజీవి ఖైదీ. ఈ సినిమాని హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నారట.

Update: 2023-10-28 12:01 GMT

మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన సినిమా 'ఖైదీ'. 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈ చిత్రం నేటితో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో చిరంజీవి ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు. "ఖైదీ చిత్రం తనని నిజంగానే అభిమానుల గుండెల్లో శాశ్వత ఖైదీని చేసింది" అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా అప్పటి విశేషాలు విషయానికి వస్తే.. ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచయితలుగా చేశారు. సుమలత, మాధవీ హీరోయిన్స్ గా నటించగా రావు గోపాల్ రావు ప్రతినాయకుడు పాత్రలో తన విలనిజం తారా స్థాయిలో చూపించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమా కథని హాలీవుడ్ మూవీ 'ఫస్ట్ బ్లడ్' నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నారట. కంప్లీట్ యాక్షన్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

ఈ సినిమా షూటింగ్‌ మొత్తం 40 రోజుల్లో పూర్తి చేశారట. కేవలం 25 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక చక్రవర్తి అందించిన పాటలు విషయానికి వస్తే.. ఎవర్‌గ్రీన్‌ గా నిలిచాయి. సినిమాలో ఐదు పాటలు ఉండగా.. నాలుగు సాంగ్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కలిసి పాడడం విశేషం. గోరింటా పూసింది, ఇదేమిటబ్బా సాంగ్స్ క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే.. 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది.
ఇప్పటికి కూడా ఈ సాంగ్ ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. చిరంజీవి, మాధవి కలిసి చేసిన ఈ నాగిని డాన్స్ ని సలీమ్‌ మాస్టర్‌ కోరియోగ్రఫీ చేశాడు. ఇప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ శివ శంకర్‌ మాస్టర్‌.. ఆ పాట సహాయకుడిగా పని చేశాడు. మరో ప్రముఖ అగ్ర డాన్స్ మాస్టర్ హీరాలాల్‌ కూడా ఈ సాంగ్ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చాడట. తెలుగులో ఇండస్ట్రీ హిట్టు అయిన ఈ మూవీ కన్నడలో స్టార్ హీరో విష్ణువర్ధన్, హిందీలో జితేంద్ర రీమేక్ చేశారు.


Tags:    

Similar News