వెండితెరకు ఇకదొరకునా ఇటువంటి సేవ
43 ఏళ్ల క్రితం విడుదలైన ఐకానిక్ సినిమా శంకరాభరణం విడుదలైన రోజే.. ఆయన కైలాసానికి ఏతెంచారు.
ప్రముఖ సినీ దర్శక దిగ్గజం, కళాతపస్వి కె. విశ్వనాథ్ గతరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త ఇండస్ట్రీ మొత్తం షాకైంది. అంతగొప్ప కళా దర్శకుడు ఇకలేడని తెలిసి ప్రముఖ దర్శకులు, హీరోలు, ఆయనతో పనిచేసిన నటీనటులు నిర్ఘాంతపోయారు. ఆయనలేని లోటు పరిశ్రమకు తీరని లోటు అంటూ నివాళులు అర్పిస్తున్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా.. సినిమా రూపంలో ఆయన బ్రతికే ఉంటారంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
"పితృసమానులైన కె.విశ్వనాథ్ గారు ఇక లేరన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. పండితుల్ని, పామరులని ఒకేలా మురిపించేలా ఆయన చిత్రాల శైలి విశిష్టమైనది. బహుశా ఆయనలాంటి దర్శకుడు మరొకరు లేరు. ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాంధవుడు అనే మూడు సినిమాల్లో నటించే అవకాశం నాకు లభించింది. మా ఇద్దరిదీ వ్యక్తిగతంగా గురు,శిష్యుల సంబంధం. 43 ఏళ్ల క్రితం విడుదలైన ఐకానిక్ సినిమా శంకరాభరణం విడుదలైన రోజే.. ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని
మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ కు నివాళి అర్పించారు.నేను ఎప్పటికీ ఆయన అభిమానినే..
"కళ సజీవమైనది. అజరామరమైనదని పూర్తిగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు. ఆయన చేసిన సేవ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది. నేను ఎప్పటికీ ఆయన అభిమానినే" అంటూ
కమల్ హాసన్ ట్వీట్ చేశారు."కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వకారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతితెలుగువాడు గర్వించేలా చేసిన ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాను" అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
"నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి. వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ" అని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ట్వీట్ చేశారు.
ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. దర్శకుడు త్రివిక్రమ్, సత్యానంద్ లతో కలిసి విశ్వనాథ్ పార్థీవదేహాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడితూ.. శంకరాభరణం సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తం రుణపడి ఉంటాము సార్" అని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
ప్రముఖ హీరోలు, రాజకీయ ప్రముఖులు, ఇతర నటీనటులు, సంగీత దర్శకులు, సింగర్లు తదితరులు విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఉదయం 11 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో విశ్వనాథ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రముఖ నటుడు ఏడిద రాజా తెలిపారు.