ఆ కేసు నుంచి షారుఖ్ కు ఊరట
తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ కోరారు. ఈ ఘటనతో ప్రత్యక్ష ..
గుజరాత్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఊరట కలిగించే వార్త వచ్చింది. వడోదర రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన 'రయీస్' సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరగగా.. ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ కోరారు. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్‌పై ఫిర్యాదు చేశారని గుజరాత్ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్ ను విసరడం, టీషర్ట్స్ విసరడం వంటివి చేయడంతో... తొక్కిసలాట జరిగింది.. అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది.
2017 జనవరి 23న షారుఖ్ తన సినిమా 'రయీస్' ప్రచారానికి వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనడంతో, జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే వ్యక్తి ఈ తొక్కిసలాట సందర్భంగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్ పై ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించడానికి, సూపర్ స్టార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వడోదర కోర్టును ఆశ్రయించారు. అయితే షారుఖ్ ఖాన్ కు ఊరట కలిగించే తాజాగా తీర్పు వచ్చింది.