సభ్యత్వ రద్దుపై స్పందించిన కరాటే కల్యాణి
ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్లెందుకు ? కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి ఆయన రూపాన్ని..
టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్.. మా అసోసియేషన్ నుంచి కరాటే కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేయడం. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం విషయం కరాటే కల్యాణి చేసిన రచ్చపై వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ ఆమెకు షోకాజు నోటీసులిచ్చింది. మూడురోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తదుపరి చర్యల్లో భాగంగా ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వం నుంచి తొలగిస్తూ.. నిన్న నోటీసులిచ్చింది.
తాజాగా కరాటే కల్యాణి తన సభ్యత్వ రద్దుపై స్పందించింది. "నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. మహానటుడు ఎన్టీఆర్ కు వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే.. అది సమాజంలోకి తప్పుగా వెళ్తుంది. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్లెందుకు ? కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి ఆయన రూపాన్ని ఎందుకు అవమానిస్తున్నారు ? ఆయన మాకెంతో ఇష్టదైవం. ఆ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరిగితే.. దేవుడికి అన్యాయం జరిగినట్టే కదా. అందుకే ఆ విగ్రహ ఏర్పాటును ఆపాలని కోర్టుకెళ్లాను. దీనిపై వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ షోకాజు నోటీసులు పంపింది. అనారోగ్యం కారణంగా మూడురోజుల్లో వివరణ ఇవ్వలేక పోయాను. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని నోటీసు రాసి పంపించా." దానిని అసోసియేషన్ లీగల్ నోటీసుగా పరిగణించి తనను సస్పెండ్ చేసిందని కరాటే కల్యాణి పేర్కొన్నారు.