మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట విషాదం
అనిరుధ్ కు స్వయానా తాత, సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు అయిన ఎస్వీ రమణన్..;
తమిళ, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట విషాదం నెలకొంది. అనిరుధ్ కు స్వయానా తాత, సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు అయిన ఎస్వీ రమణన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎస్ వి రమణన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు.
1930-40లో పలు చిత్రాలకు దర్శకత్వంలో వహించిన కె.సుబ్రమణియన్ కుమారుడే ఎస్వీ. రమణన్. తండ్రి సహాయంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన రమణన్.. పలు శాఖల్లో పేరు తెచ్చుకున్నారు. రేడియో రంగంలో పలు ప్రయోగాలు చేశారు. వేలాది రేడియో ప్రసారాలకు డబ్బింగ్ చెప్పారు. భక్తిరస లఘు చిత్రాలను రూపొందించారు. దొరబాబు శోభనం, ఉరువంగల్ మరళం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ఎస్ వి రమణన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొందాడు. పలు తమిళ, తెలుగు చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. ఆ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.