వ్యూహం చిత్రంపై వర్మ ఆశలు ఆవిరి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి

Update: 2023-12-23 02:17 GMT

 ramgopal varma vyuham movie

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. విజయవాడలో డిసెంబర్ 23 శనివారం రోజుల వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పెట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించి వర్మకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేందు 'వ్యూహం' సినిమా తీశారని, ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. లోకేశ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వ్యూహం చిత్రం విడుదలపై ఆంక్షలు విధించింది. వ్యూహం చిత్రాన్ని ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని సివిల్ కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యూహం చిత్ర నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, నారా లోకేశ్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

వ్యూహం చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిర్మాతలను ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, రామదూత క్రియేషన్స్, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీలను లోకేశ్ తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి జగన్ కు మేలు చేసేలా ఈ చిత్రం ఉందని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటే తనకు నచ్చదని రామ్ గోపాల్ వర్మ చెప్పారని లోకేశ్ తన పిటిషన్ లో స్పష్టం చేశారు. తనకు నచ్చిన విధంగా ఈ సినిమాలో పాత్రలను నిర్ణయించారని, ట్రైలర్ చూపినట్టే సినిమా అంతా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ చిత్ర దర్శకనిర్మాతలు గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి చిత్రాలు తీశారని, వారికి ఆయా చిత్రాలతో ఎలాంటి లాభాలు రాకపోయినా ఇప్పుడు వ్యూహం చిత్రం తీశారని లోకేశ్ వివరించారు. నష్టపోతామని తెలిసినా జగన్ కు లబ్ది చేకూర్చేందుకు ఈ సినిమా తీశారని, ఈ సినిమా నిర్మాణం వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు.
వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఏర్పాట్లను చూసేందుకు శుక్రవారం నాడు ఇందిరా గాంధీ స్టేడియంకు వచ్చారు దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్. వ్యూహం సినిమా గురించి వర్మ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఆలోచనా విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నానని అన్నారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైసీపీ పార్టీ నుండి పలువురు నాయకులు వస్తున్నారని చెప్పిన వర్మ.. ఈ వ్యూహం రాజకీయ వ్యూహం గురించి తీయలేదన్నారు. ఈ సినిమాలో ఇటీవల జరిగిన చంద్రబాబు అరెస్ట్,వివేకా హత్య వంటి సన్నివేశాలతో పాటు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, షర్మిల, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్రలు కూడా ఉంటాయన్నారు. అయితే కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News