కృష్ణంరాజు మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో..
టాలీవుడ్ రెబల్ స్టార్, రాజకీయ నేత కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్నో సినిమాల్లో నటించి.. అలరించి, మెప్పించిన కృష్ణంరాజు మృతిని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. సినీ లోకానికి ఇది నిజంగా తీరని లోటే. టాలీవుడ్ కు ఊహించని షాక్. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కృష్ణంరాజు మరణంపై దిగ్భ్రాంతి చెందారు.
రెబల్ స్టార్ మృతిపట్ల ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త ఎంతో బాధించిందన్నారు. 187కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. వాజ్ పేయి కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన తీరు ఆదర్శనీయమన్నారు. "వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని , వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని విష్ణువర్థన్ పేర్కొన్నారు.
మంచితనానికి మారుపేరు
"కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను." అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
టాలీవుడ్ కి తీరని లోటు
రెబల్ స్టార్ కృష్ణంరాజు టాలీవుడ్ కి తీరని లోటన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆయన మరణవార్త తమను ఎంతో బాధించిందన్నారు. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని, కృష్ణంరాజు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.