Premalu: ప్రేమలు నటుడికి రోడ్డు ప్రమాదం
శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో
ప్రేమలు సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేసింది. ఈ సినిమాను యూత్ కూడా ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రేమలు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో కొచ్చి లోని MG రోడ్డులో జరిగిన ప్రమాదంలో నటులు అర్జున్ అశోకన్, మాథ్యూ థామస్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ సహా ఐదుగురు గాయపడ్డారు. అరుణ్ జోస్ దర్శకత్వంలో వస్తున్న బ్రోమాన్స్ సినిమా కోసం వెహికల్ ఛేజ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నటీనటులు కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదంలో సంగీత్ మెడ ఎముక విరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ కాలికి గాయమైంది. అర్జున్ అశోకన్, మాథ్యూ థామస్, స్టంట్ డ్రైవర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. స్టంట్ టీమ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
కారు ముందు సీటులో అర్జున్ అశోకన్, వెనుక సీటులో సంగీత్ ప్రతాప్ ఉన్నారు. షూటింగ్ సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు బైక్‌లను ఢీకొట్టడంతో రోడ్డు పక్కన బైక్‌పై నిలబడి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్‌ని ఢీకొట్టింది. అనంతరం కారు బోల్తా పడింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, చిత్రబృందం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఛేజ్ సీన్ చిత్రీకరించేందుకు ప్రొడక్షన్ టీం అనుమతి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.