దేశం మీసం మెలేసిన RRR.. నాటు నాటు పాటకు ఆస్కార్

భారత ప్రభుత్వం తరపున అధికారికంగా ఎంపిక కాకపోవడంతో.. సొంతంగా ఆస్కార్ నామినేషన్లకు వెళ్లిన RRR...

Update: 2023-03-13 03:13 GMT

oscar for natu natu song

తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా నాటు నాటు రికార్డు క్రియేట్ చేసింది. భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. ఈ రోజు కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన అందరికీ భావోద్వేగ క్షణం. భారత ప్రభుత్వం తరపున అధికారికంగా ఎంపిక కాకపోవడంతో.. సొంతంగా ఆస్కార్ నామినేషన్లకు వెళ్లిన RRR అనుకున్నది సాధించింది. తెలుగు సినీ ప్రేక్షకుల కలల్ని నిజం చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR నాటు నాటు పాట నామినేషన్ లో నిలబడింది. ఈ రోజు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్లో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు పాట.. ఆస్కార్ అవార్డును అందుకుంది.


ఈ అవార్డులను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ముందుగా ఈ ఆస్కార్ అవార్డులను తయారు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఈ అవార్డు కోసం, ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూశామన్నారు. ఈ అవార్డుతో భారతీయులను గర్వించేలా చేశామన్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాటకు పట్టంకట్టిన ఆ సన్నివేశాన్ని చూసి భారత, తెలుగు సంగీత ప్రియులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆర్ఆర్ఆర్.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటను.. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచగా.. సింగర్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేయగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఉక్రెయిన్ లో చిత్రీకరించిన ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో శ్రమించారు. ఇటీవల ఓ అమెరికన్ ప్రోగ్రాం లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. పాట డ్యాన్స్ ప్రాక్టీస్ కంటే.. చరణ్ , తాను కలసి సింక్ చేయడానికే ఎక్కువ సమయం పట్టేదన్నారు. రోజుకి మూడు గంటలు ప్రాక్టీస్, షూటింగ్ ముందు, తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేసేవాళ్లమని తెలిపారు. ఆ సమయంలో తన కాళ్లు కూడా సరిగ్గా పనిచేయలేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు.



 



Tags:    

Similar News